రాజకీయాల్లో కూడా కాలం కలసిరావాలి. లేకపోతే తాడే పాము అవుతుంది. ఇపుడు సీన్ చూస్తూంటే అలాగే ఉంది. ఏపీలో ఏడాదిన్నర క్రితం తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. దాని నుంచి తేరుకుని ముందుకు సాగుదామనుకున్నా కూడా అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఉప ఎన్నికలు ఎక్కడా జరగలేదు. మూడున్నరేళ్ళ పదవీకాలం పూర్తి అయ్యాక నంద్యాల ఉప ఎన్నిక అనివార్యంగా వచ్చింది. దాంతో మొత్తం అధికార యంత్రాంగాన్ని మోహరించి బాబు అక్కడ ఘన విజయం సాధించారు.

ఇక ఇపుడు చూస్తే ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిరన్నలోపే  ఉప ఎన్నిక వచ్చింది. తిరుపతి లోక్ సభకు వచ్చిన ఉన ఎన్నికలో పోటీకి అన్ని పార్టీల కంటే ముందే టీడీపీ ఉత్సాహం చూపించింది. నిజానికి టీడీపీకి తిరుపతి లోక్ సభ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా టీడీపీకి ఇపుడు  లేరు. ఆ మాటకు వస్తే చిత్తూరు జిల్లా మొత్తం మీద టీడీపీ తరఫున గెలిచింది  చంద్రబాబు ఒక్కరే. రాయలసీమలో చూస్తే  వైసీపీకి మంచి బలం ఉంది.

ఇక సామాజిక వర్గాల సమీకరణలు చూసుకున్నా తిరుపతి సీట్లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీలకు ఉన్నాయి. ఆ సీట్లలో వైసీపీకి పూర్తి బలం ఉంది. దాంతో వైసీపీకి తిరుపతి ఉప ఎన్నిక నల్లేరు మీద నడక అని అంటున్నారు. అయితే గతంలో వైసీపీకి వచ్చిన రెండున్నర లక్షల ఓట్ల మెజారిటీని తగ్గించాలని టీడీపీ తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి దిగుతోందని అంటున్నారు. ఒక్క ఓటు వైసీపీకి తగ్గినా ప్రజా వ్యతిరేకత అదిగో అని చూపడానికి రెడీగా ఉంది.

అందుకోసమే అందరి కంటే ముందుగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును చంద్రబాబు ప్రకటించారు. ఇది జరిగి వారం రోజులు దాటినా కూడా పనబాక నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో ఇపుడు టీడీపీ శిబిరంలో అలజడి రేగుతోంది. అదే సమయంలో తిరుపతి పరిధిలోని పార్టీ క్యాడర్ కూడా పనబాక ఎంపికను వ్యతిరేకిస్తున్నారుట. తమను సంప్రదించకుండా ఆమెను పోటీకి దించడమేంటని వారు అంటున్నారుట. మరో వైపు పనబాకకు పోటీ చేయడం ఇష్టం లేదని అంటున్నారు బలంగా ఉన్న వైసీపీని ఢీ కొట్టడం కష్టమేనని అన్న ఆలోచన ఆమెకు ఉందని చెబుతున్నారు. మరి ఇన్ని సమస్యల మధ్య తిరుపతిలో పనబాక పోటీకి సై అంటారా. లేక చంద్రబాబుకు షాక్ ఇస్తారా అన్నది చూడాలంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: