ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మంచి ఊపు మీద ఉన్నట్లు కనిపిస్తోంది. ఎప్పుడైతే తెలంగాణ దుబ్బాక ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్‌పై విజయం సాధించారో..అప్పటినుంచి బీజేపీ దూకుడు మీద ఉంది. ఆ విజయంతో తెలంగాణలో బీజేపీ, అధికార టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తుంది. అలాగే జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్‌ని దెబ్బకొడతామని చెబుతున్నారు. అయితే తెలంగాణ బీజేపీ దూకుడుగా ఉండటంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. కానీ అక్కడ విజయం చూసుకుని బీజేపీ ఏపీలో హడావిడి చేస్తుంది.

త్వరలో జరగనున్న తిరుపతి ఉపఎన్నికలో విజయం తమదే అని మాట్లాడుతున్నారు. అసలు ఏపీలో బీజేపీకి ఉన్న ఓట్లు ఎన్ని? తిరుపతిలో గెలిచే సత్తా బీజేపీకి ఉందా? అనే విషయాన్ని ఒక్కసారి చూస్తే...2019 ఎన్నికల్లో బీజేపీ నోటా ఓట్ల కంటే దాటలేదు. ఒక్క అభ్యర్ధి కూడా డిపాజిట్లు దక్కించుకోలేదు. తిరుపతి పార్లమెంట్‌లో సైతం. మొదటి స్థానంలో వైసీపీ ఉంటే, రెండో స్థానంలో టీడీపీ ఉంది.

ఇక విచిత్రం మూడో స్థానంలో నోటా ఉండగా, నాలుగు కాంగ్రెస్, ఐదు బి‌ఎస్‌పి ఉన్నాయి. ఇక ఆరో స్థానంలో బీజేపీ ఉంది. అప్పుడు బీజేపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు కేవలం 16 వేలు. అయితే ఇప్పుడు బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నాయి. హైదరాబాద్ ఎన్నికల మాదిరిగా జనసేనని సైడ్ చేసి బీజేపీ బరిలో దిగితే డిపాజిట్ అయిన దక్కించుకోవడం కష్టమే అని విశ్లేషుకులు అంటున్నారు. మొన్న ఎన్నికల్లోనే జనసేనతో పొత్తులో పోటీ చేసిన బి‌ఎస్‌పికి 20 వేలు ఓట్లు పడ్డాయి.

అంటే దీని బట్టి చూస్తే బీజేపీకి ఎన్ని ఓట్లు పడతాయో అర్ధం చేసుకోవచ్చు. అలా కాకుండా జనసేన పోటీ చేయాల్సిందే అని ఆ పార్టీ శ్రేణులు గట్టిగా కోరుతున్నాయి. ఒకవేళ పొత్తు కుదరకపోతే బీజేపీకి ఇంకా ఎన్ని ఓట్లు వస్తాయో చెప్పాల్సిన పనిలేదు. మొత్తానికి చూసుకుంటే తిరుపతిలో బీజేపీ సత్తా ఏంటనేది ప్రజలకు బాగానే అర్ధమైయిందనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: