జగన్ కొట్టిన దెబ్బకు విశాఖపట్నంలో టీడీపీ అసలు కోలుకోలేకపోతుందనే చెప్పొచ్చు. జగన్ మూడు రాజధానుల్లో భాగంగా విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ టీడీపీ మాత్రం ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని ఉద్యమాలు కూడా చేస్తుంది. దీంతో విశాఖలో తెలుగు తమ్ముళ్ళ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది. అటు అమరావతికి మద్ధతు తెలపలేరు. ఇటు విశాఖని స్వాగతించలేరు.

పైగా ప్రజలకు కూడా టీడీపీపై నమ్మకం తగ్గినట్లే కనిపిస్తోంది. విశాఖలో వైసీపీ డామినేషన్ బాగా ఉంది. అందుకే పలువురు టీడీపీ నేతలు అధికార పార్టీ బాటపట్టారు. ఇప్పటికే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వైసీపీ వైపుకు వచ్చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు వైసీపీలో చేరిపోయారు. మరికొందరు నేతలు కూడా అటు,ఇటు ఊగిసలాడుతున్నారు. విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రేపో మాపో జంప్ కొట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇటు మిగిలిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణలు సైలెంట్‌గా తమ పని తాము చూసుకుంటున్నారు. అయితే పరిస్థితులని చక్కదిద్దటానికి చంద్రబాబు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులని పెట్టారు. విశాఖకు పల్లా శ్రీనివాస్, అనకాపల్లికి బుద్దా నాగజగదీశ్వరావు, అరకు పార్లమెంట్ స్థానానికి గుమ్మడి సంధ్యారాణిని నియమించారు. అయితే మిగిలిన జిల్లాల్లో ఉన్న పార్లమెంట్ అధ్యక్షులు మాదిరిగా విశాఖలో నేతలు దూకుడుగా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు.

విశాఖలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. అయితే ఇక్కడ టీడీపీ తరుపున లీడ్ తీసుకుని ముందుకుతీసుకెళ్లే నాయకులే కనబడటం లేదు. అయితే విశాఖలో బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ పార్టీ మీద గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే విశాఖ పార్లమెంట్ పరిధి వరకే భరత్‌కు పట్టు దక్కే అవకాశముంది. విశాఖ పార్లమెంట్ ఇన్‌చార్జ్ కాబట్టి, ఏడు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయడానికి చూస్తున్నారు. అయితే వైసీపీకి ధీటుగా టీడీపీని నిలపడం కష్టమైన పని అనే చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: