ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యాణ తదితర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే దీనికి భిన్నంగా ఉత్తరాఖండ్‌లోని బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రకటన విస్మయానికి గురిచేస్తోంది. కులాంతర, మతాంతర వివాహం చేసుకున్నవారికి రూ. 50 వేలు ప్రోత్సాహకంగా అందజేయనున్నట్టు తెలిపింది. ఉత్తరాఖండ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ఉత్తర్వులు ప్రకారం.. అన్య మతస్తులు, కులాంతర వివాహం చేసుకున్న జంటలకు నగదు ప్రోత్సాహాన్ని అందజేస్తారు. అయితే ఈ లబ్ధి పొందేందుకు ప్రభుత్వం ఒక షరతు విధించింది. భార్య, భర్తలలో ఎవరైనా సరే సెక్షన్ 341లో పేర్కొన్న విధంగా షెడ్యూల్డ్ కులాలకు చెందినవారై ఉండాలి.

తెహ్రీ గర్వాల్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నవంబరు 18న జారీచేసిన ఈ ఉత్తర్వుల్లో సమాజం, దేశంలో ఐక్యత కోసం కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొన్నారు. గుర్తింపు ఉన్న ఆలయాలు, మసీదుల్లో వివాహం చేసుకున్నా లేదా సంబంధిత శాఖలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నా ఈ ప్రోత్సాహం అందుతుందని తెలిపింది. వివాహం చేసుకున్న ఏడాదిలోపు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ మొత్తాన్ని జంటకు సంయుక్తంగా అందజేస్తారు. ఇటువంటి వివాహాలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూ.10,000 ప్రోత్సహాకం 2014 నుంచి అందజేస్తోంది. ప్రస్తుతం అది రూ.50వేలకు పెరిగింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం 1976లో అంతర్దార్మిక వివాహ్ ప్రోత్సహన్ నియమావళి పేరుతో అమల్లోకి తెచ్చింది. అయితే ఈ ఉత్తర్వులపై హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది లవ్ జీహాద్‌ను ప్రోత్సహించేలా ఉందని విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. మత మార్పిడిలను ప్రోత్సహించేదిగా ఉందని మండిపడుతున్నారు. ఇప్పుడు హిందువులను ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల మహిళలు ఇస్లాం, ఇతర మతాలలోకి మారడాన్ని ప్రోత్సహించడమే కాకుండా, ప్రోత్సాహకం కోసం హిందూ మహిళలను పెళ్లి చేసుకోవడానికి ఇతర వర్గాలకు చెందిన వారిని ప్రోత్సహిస్తుంది అని వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: