దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. దీని కోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించ బోతున్నారు. మంగళవారం ఈ సమావేశం జరగనుంది. కరోనాను నిలువరించేందుకు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుందని సమాచారం. అలాగే రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని, మూడో దశ ట్రయల్స్‌కు సిద్ధంగా ఉన్న కరోనా వ్యాక్సీన్‌లపై కూడా చర్చిస్తారట.

ఇప్పటికే కరోనాపై నీతి ఆయోగ్ ప్రధానితో మాట్లాడింది. దేశంలో కరోనా వ్యాప్తి, వ్యాక్సీన్ ఎప్పటికి వస్తుంది? తదితర విషయాలను ప్రధానికి వివరించిందట. అలాగే ఈ వ్యాక్సీన్‌కు ఎంత ధర నిర్ణయించాలన్న విషయంలో కూడా నీతి ఆయోగ్ సభ్యుల మద్య చర్చ జరిగిందని సమాచారం. ఈ సమావేశం తర్వాత కరోనా వ్యాక్సీన్ విషయంలో ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తోంది. రెండు దశల ట్రయల్స్ పూర్తి చేసుకొని మూడో దశ ట్రయల్స్ కోసం ఎదురు చూస్తున్న వ్యాక్సీన్‌ను అత్యవసర చికిత్సలో ఉపయోగించే ఆలోచనలో ప్రభుత్వం ఉందట. దీనికోసం అనుమతులు ఇస్తే ఎలా ఉంటుంది? అని కేంద్రం యోచిస్తోంది.

ఇవే విషయాలను ప్రధాని మోదీ.. అన్ని రాష్ట్రాల సీఎంల ముందు పెట్టి, అభిప్రాయాలు సేకరించాలని ఆలోచిస్తున్నారట. ఈ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయనేది కూడా ముఖ్యమే. అదే సమయంలో కేంద్ర మంత్రి హర్ష వర్ధన కూడా ఈ విషయంపై మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశానికి కరోనా వ్యాక్సీన్ లభిస్తుందని ఆయన చెప్పారు. వ్యాక్సీన్ రాగానే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఏది ఏమైనా వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి కనీసం 25-30 కోట్ల మంది భారతీయులకు కరోనా టీకాలు వేసేస్తామని వెల్లడించారు. ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి భయాలూ అక్కర్లేదని, కరోనా వ్యాక్సీన్ పంపిణీ ఎలా చేయాలనే విషయంపై ప్రభుత్వానికి స్పష్టత ఉందని ఆయన చెప్పారు. ఈ విషయంలో కూడా అన్ని రాష్ట్రాల సీఎంల సమావేశంలో మోదీ మాట్లాడతారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: