కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత స్థితిని చూసి బాధపడాలో ఆవేశపడాలో కూడా అర్ధం కావడంలేదు. శతాధిక వయస్సు కలిగిన ఏకైక పార్టీగా దేశంలో కాంగ్రెస్ ఉంది. ఆ పార్టీకి ఇప్పటికీ ప్రతీ పల్లెల్లో కొన్ని ఓట్లు ఉన్నాయి. దేశమంతా తెలిసిన పార్టీ కాంగ్రెస్. అటువంటి కాంగ్రెస్ కి జాతీయ స్థాయిలో ఇబ్బందులు ఉన్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల జనంలో పెద్దగా అనుకూలత లేకపోవడం, సోనియా గాంధీ అనారోగ్యం పాలు కావడంతో కాంగ్రెస్ పార్టీ నానాటికీ నీరసించిపోతోంది.

ఇక తాజాగా తెలంగాణాలోనూ కాంగ్రెస్ తీసికట్టు అవుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో మూడవ స్థానానికి చేరుకున్న కాంగ్రెస్ ఇపుడు గ్రేటర్ హైదరాబాద్  ఎన్నికల్లో కూడా కకావికలవుతోంది. కాంగ్రెస్ కి తెలంగాణాలోనూ సరైన నాయకత్వం లేకపోవడంతో బీజేపీ ఆ చాన్స్ ని చక్కగా  ఉపయోగించుకుంటోంది. దుబ్బాక గెలుపు ప్రభవంతో బీజేపీ దూసుకుపోతోంది. ఈ పరిణామాలతో కాంగ్రెస్ లోని బిగ్ షాట్స్ మీదనే బీజేపీ కన్ను వేసింది.

ఒక్కొక్కరినీ బీజేపీ వైపుగా నడిపిస్తోంది. ఫైర్ బ్రాండ్ గా ఉన్న విజయశాంతిని బీజేపీ వైపుగా మళ్ళించడంతో కమలదళం ఫుల్ సక్సెస్ అయింది. ఆమె ఈ నెల 24న ఢిల్లీ వెళ్ళి బీజేపీ అగ్ర నాయకత్వాన్ని కలిసి కాషాయం కండువా కప్పుకుంటారని టాక్. ఇక కాంగ్రెస్ లో ఉన్న సర్వే సత్యనారాయణ వంటి సీనియర్ నేతలను కూడా బీజేపీ దువ్వుతోంది.

పనిలో పనిగా మరో ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని కూడా బీజేపీ తన వైపునకు తిప్పుకోవాలని చూస్తోంది. గ్రేటర్ ఎన్నికలను సవాల్ గా బీజేపీ తీసుకుంది. మొత్తం 150 సీట్లకు గానూ కనీసంగా పాతిక ముప్పై సీట్లు బీజేపీ గెలుచుకున్నా కూడా తెలంగాణాలో కాషాయం దూకుడుని ఎవరూ ఆపలేరు అంటున్నారు. 2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కేవలం మూడే మూడు సీట్లను తెచ్చుకున్న బీజేపీ స్కోర్ ఇపుడు ముప్పైకి చేరితే అది కచ్చితంగా ఘన విజయం కిందనే లెక్క వేసుకోవాలి. అంతే కాదు 2023 ఎన్నికలకు బీజేపీ రెడీ అయినట్లుగానే భావించాలి. మొత్తానికి బీజేపీ దూకుడు వల్ల ఫస్ట్ దెబ్బ కాంగ్రెస్ కే పడుతున్నట్లుగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: