జైపూర్: దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటికే దేశంలో 91 లక్షలపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కరోనా కేసులు అధికంగా నమోదైన 8 జిల్లాల్లో నైట్ కర్ఫ్యూలు విధించాలని రాజస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటన చేశారు. ఈ నిర్ణయం ప్రజల క్షేమం కోసమేనని సీఎం స్పష్టం చేశారు. కర్ఫ్యూ విధిస్తున్న 8 జిల్లాల్లో కరోనా కట్టడి చేయాల్సిన బాధ్యతలను కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, పోలీసులకు అప్పగిస్తున్నట్లు చెప్పారు.

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకే కర్ఫ్యూ విధించామన్న ఆయన.. పెళ్లి, వేడుకల జరిగేటప్పుడు వంద మందికి మించి అతిథులు హాజరవ్వడానికి అనుమతి లేదని తెలిపారు. ఈ నిబంధన అందరూ పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. అలాగే ఇలా వేడుకలకు వచ్చిన వారు కూడా తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని అన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోందని, ఇటువంటి సమయంలో వివాహాల వంటి వేడుకలకు ఎక్కువ మంది అతిథులు హాజరైతే కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే వివాహాలు జరిగే ప్రాంతంలో పోలీసులు, ఇతర పరిపాలనా అధికారులు ఉంటారని, నిబంధనలు అమలవుతున్నాయో లేదో పరిశీలిస్తారని చెప్పారు.

అలాగే అధికారులు పెళ్లికి సంబంధించిన వీడియో గ్రఫీ కూడా చేయిస్తారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వివాహాలకు వందమందికి మించి అతిథులు హాజరైతే 25 వేల రూపాయల వరకు జరిమానా విధిస్తామని వెల్లడించారు. అదే విధంగా రోడ్లపైకి వచ్చే వారు కంపల్సరీగా సామాజిక దూరం పాటించాలని, మార్కెట్లలో కూడా సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించినా, మాస్కు లేకుండా బయటకు వచ్చినా 500 రూపాయల జరిమానా విధిస్తామని చెప్పారు. రాజస్థాన్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో కరోనా నియంత్రణకు సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు గెహ్లాట్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: