ఇటీవలే భారత్‌లో కరాచీ గురించి తీవ్ర వివాదం నడుస్తోంది. కరాచీ బేకరీ పేరు మార్చాలని ఓ షాపు యజమానికి శివసేన నేత అల్టిమేటం ఇవ్వడంపై మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేగింది. అయితే ఈ విషయమై శివసేన ప్రధాన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ స్పందించారు. కరాచీ బేకరీ, కరాచీ స్వీట్లు ముంబైలో 60 ఏళ్లుగా ఉన్నాయని, వాళ్లను పాకిస్తానీలుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. పేర్లు మార్పించడం శివసేన వైఖరి కాదని, ఇక్కడ అందరూ స్వేచ్ఛగా జీవించొచ్చని ఆయన అన్నారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.

కరాచీ భారత్ లో కలవడం ఖాయమన్నారు ఫడ్నవీస్. అఖండ భారత్ తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఒకరోజు కరాచీ భారత్‌లో కలిసే రోజు తప్పక వస్తుందన్నారు. అఖండ భారత్ అనే దాన్ని తమ పార్టీ నమ్ముతుందన్నారు. ఒకరోజు తప్పకుండా కరాచీ భారత్‌లో కలుస్తుందని ఆయన విశ్వసించారు. యూపీలో లవ్ జిహాద్ పై కూడా ఆయన స్పందించారు. హిందువుల్ని తిట్టడం సెక్యులరిజం అని కొన్ని పార్టీలు భావిస్తున్నాయన్నారు. హిందూయిజం పట్ల వారికి వ్యతిరేకత ఉందన్నారు. తమ పార్టీ బీజేపీ అధికారంలో లేని కేరళలో కూడా లవ్ జిహాద్ ఉందన్నారు.

కరాచీ వివాదం వివరాలు చూస్తే.. బాంద్రాలో ఉన్న కరాచీ బేకరీకి వచ్చిన శివసేనకు చెందిన నితిన్ నందకిశోర్ అనే నేత.. కరాచీ పేరు మార్చాలంటూ షాపు యజమానికి అల్టిమేటం జారీ చేశారు. మార్చిన పేరు కూడా హిందీ, ఇంగ్లీషులో కాకుండా మరాఠీలో రాయాలని సూచించారు. దీంతో తీవ్ర భయానికి లోనైన షాపు యజమాని షాపు పేరుపై కవర్ కప్పేశాడు. ‘నువ్వు కరాచీ నుంచి వచ్చి ముంబైలో ఉంటున్నావు. నువ్వు ఏ మతాన్ని అయినా పాటించు, నాకు అభ్యంతరం లేదు. నువ్వు ముస్లిమైన కావొచ్చు, హిందువైనా కావొచ్చు. కానీ ముంబైలో ఉంటున్నావు. కానీ కరాచీ అనే పేరు పాకిస్తాన్‌ నుంచి వచ్చింది. దేశ విభజన అనంతరం మీరు ఇక్కడ బతుకున్నారు. ఇక్కడ ఉండండి, హాయిగా వ్యాపారాలు చేసుకోండి. కానీ ఆ పేరు మాత్రం తొలగించండి’ అని షాపు యజమానితో నితిన్ అన్నారు. ఇదంతా వీడియో తీసి తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: