హైదరాబాద్ నగరంలో గ్రేటర్ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంఐఎం అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి వచ్చిన ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి చుక్కెదురైంది. జాంబాగ్‌లో ఎంఐఎం అభ్యర్థి రవీందర్ కోసం ప్రచారం చేయడానికి ఓవైసీ వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న మహిళలు ఆయన్ను అడ్డగించారు. వరద సాయం నిలిపి వేయడంపై ఓవైసీని వాళ్లు ప్రశ్నించారు.

తమకు ఎంఐఎం పార్టీ ఏమీ చేయలేదని నిలదీశారు. గతంలో జాంబాంగ్‌లో ఎంఐఎం అభ్యర్థికే ఓటేశామని, కానీ ఇక్కడ ఎటువంటి అభివృద్ధీ జరగలేదని విమర్శించారు. ఇలా ఐదేళ్లకు ఓసారి వచ్చి ఓట్లు అడగటం తప్ప తమకు ఎటువంటి ప్రయోజనం చేయలేదని ఓవైసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లేసి గెలిపిస్తే మాత్రం తమను అసలు పట్టించుకోవడం లేదని, మొహం చాటేస్తున్నారని ఎత్తి పొడిచారు. వారిని సమాధాన పరచడానికి ఓవైసీ ప్రయత్నించారు. కానీ మహిళలు ఆయన మాటలు వినకుండా సమాధానాలు చెప్పాలనడంతో ఆయన ఏమీ చేయలేకపోయారు. ఆ ఆందోళన పెద్దది కాకముందే వెనుదిరిగారు.

ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల్లో ఇలాంటి దృశ్యాలే ఎక్కువగా కనబడుతున్నాయి. చాలాచోట్ల ఎమ్మెల్యేలకు సైతం ఓట్లరు చుక్కలు చూపిస్తున్నారు. వరద సాయం నిలిచిపోవడంపై బాధితులు చాలా అసహనంగా ఉన్నారు. దీని గురించి వచ్చిన ప్రతి నేతనూ ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇటీవల యప్రాల్ ప్రాంతంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావును కూడా ప్రజలు అడ్డుకున్నారు. వరద సాయం గురించి ప్రశ్నించారు. ఆ తర్వాత రోడ్లేస్తేనే ఓటేస్తామని గట్టిగా చెప్పారు. ‘నో రోడ్ - నో వోట్’, ‘రోడ్డు వేయండి - ఓట్లు అడగండి’ నినాదాలతో నిరసనకు దిగారు. అంతేగాక రెండు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. స్థానికుల నిరసనతో ఎన్నికలు అవ్వగానే రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. సొంత డబ్బులతో రోడ్డు వేయిస్తానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: