ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇది చేదువార్త. గతంలో ఉన్న నిబంధనే అయినా.. ఇప్పుడు దీన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయ ఉద్యోగులు కచ్చితంగా వారు పనిచేసే ఊరిలోనే నివాసం ఉండాలని, అలా చేయని వారి వివరాలు ఉన్నతాధికారులకు పంపాలని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగుల పనివేళలపై ప్రభుత్వం కఠినంగా ఉంది. ఇప్పుడు వారి నివాసం విషయంలో కూడా అంతే కఠినంగా వ్యవహరించాలని చూస్తోంది.

గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, ఇకపై అదే గ్రామ పరిధిలో నివాసం ఉండాలి. వార్డు సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు ఇకపై అదే మున్సిపాల్టీ లేదా కార్పొరేషన్ పరిధిలోనే నివశించాలి. అలా చేయగలిగితేనే ప్రజల సమస్యలు నూటికి నూరుపాళ్లు, అనుకున్న సమయానికి పరిష్కారం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఉద్యోగులంతా పనిచేసే ప్రాంతాల్లోనే నివాసం ఉండాలనే నిబంధన విధించింది. గతంలో ఉన్న నిబంధనే అయినా.. వివిధ కారణాల వల్ల దీని అమలు తీరుని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల విషయంలో ఈ నిబంధన కచ్చితంగా అమలు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.

అయితే సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు, ఉద్యోగులు.. ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీ టైమ్ లో అందరూ ఆఫీస్ లలోనే ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నామని, డ్యూటీ దిగి ఇంటికి వెళ్లిపోయాక కూడా వాట్సప్,  ఫోన్లో అధికారులకు అందుబాటులో ఉంటున్నామని, అలాంటి సమయంలో ఇంకా ఎందుకిలా కఠిన నిబంధనలు తమపై రుద్దుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కనీస వసతులు కూడా ఉండవని, గ్రామస్తులే ఊళ్లలో ఉండలేక, సమీప పట్టణాలకు వలస పోతున్న సమయంలో.. ఉద్యోగుల్ని తిరిగి ఊళ్లలో మకాం పెట్టాలని చెప్పడం భావ్యం కాదని అంటున్నారు. భార్య, భర్త వేర్వేరు చోట్ల ఉద్యోగాలు చేసే సందర్భంలో ఇలాంటి నిబంధనలు ఎలా పాటించగలరని వాపోతున్నారు. మొత్తమ్మీద ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సచివాలయ ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: