ఒకప్పుడు అమెరికా, రష్యా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. రెండు అగ్ర రాజ్యాలు ఆధిపత్యంకోసం పాకులాడేవి. ఇప్పుడు రష్యాకి ఆ పరిస్థితి లేదనుకోండి. అయినా కూడా అమెరికా పేరెత్తితే రష్యా రగిలిపోతుంటుంది. తాజాగా అమెరికాలో జరిగిన ఎన్నికల విషయంలో కూడా రష్యా అధ్యక్షుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలుపొందారు, అధికార మార్పిడి కూడా జరుగుతోంది. మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు. బైడెన్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని.. రిగ్గింగ్ చేశారని ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ట్రంప్ కి వంతపాడుతున్నారు. జో బైడెన్ గెలుపును తాము గుర్తించడం లేదని స్పష్టం చేశారు పుతిన్.

"ప్రతిపక్ష పార్టీ ఓటమిని అంగీకరించినప్పుడే ఆ ఎన్నికలు ముగిసినట్టు లెక్క. అమెరికా ఎన్నికల్లో ప్రతిపక్షం తమ ఓటమిని అంగీకరించడంలేదు కాబట్టి ఏదో తిరకాసు జరిగిందనే భావించాలి. అమెరికా అధ్యక్షుడిగా ఏ పార్టీ వాళ్లు ఎన్నికైనా మాకు అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బైడెన్ను అధ్యక్షుడిగా మేము గుర్తించలేము" అని స్పష్టం చేశారు పుతిన్. అమెరికా, చైనా వ్యవహారాలపై కూడా పుతిన్ వెటకారంగా స్పందించారు. కొత్తగా చెడిపోయేదేముంది అంటూ సమాధానమిచ్చారు.

చైనా కూడా జో బైడెన్ను అమెరికా అధ్యక్షుడిగా తొలుత ఒప్పుకోలేదు. చాలా రోజుల తర్వాత బైడెన్ కు చైనా శుభాకాంక్షలు చెప్పింది. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు కూడా ఇలాగే అమెరికా కొత్త అధ్యక్షుడిని తాము గుర్తించలేదు అనడం సంచలనంగా మారింది.

" అమెరికాతో మాకు ఎప్పుడో సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా మాకు వచ్చే నష్టమూ… లేదు లాభము లేదు. అయితే ప్రజాస్వామ్య దేశంలో ఓడి ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు చెప్పిందంటే ఆ విషయం గురించి అందరూ ఆలోచించాలి. ప్రతిపక్ష పార్టీ ఓటమిని అంగీకరించినప్పుడే ఆ ఎన్నిక పూర్తవుతుంది. అమెరికాలో ఇప్పుడా పరిస్థితి లేదు". అని అన్నారు పుతిన్. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తప్పిదాలు జరిగాయని సాక్షాత్తూ మరో పార్టీ అభ్యర్థి ప్రకటిస్తున్నారు కాబట్టి మేము జో బైడెన్ ను అమెరికా నూతన అధ్యక్షుడిగా గుర్తించలేకపోతున్నాం’ అని రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: