ఏపీలో రైతులపై మరోసారి వరాల జల్లు కురిపించారు సీఎం జగన్. ఇప్పటికే రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా పేరుతో నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్న వైసీపీ ప్రభుత్వం.. మద్దతు ధరతో వారిని నష్టపోకుండా ఆదుకుంటోంది. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం కోసం ఏకంగా 10వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ రైతాంగానికి మరో మేలు చేకూర్చే దిశగా అడుగులు వేసింది. శాశ్వత ప్రాతిపదికన జరిగే ఈ వ్యవహారం.. రైతులకు మరింత మేలైన మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించబోతోంది. ఈ విధానం పూర్తి స్థాయిలో విజయవంతం అయితే రైతులు ఇక జగన్ ని మరచిపోయే ప్రసక్తే లేదని అంటున్నారు.

రైతు భరోసా కేంద్రాల పరిధిలో గోడౌన్ల నిర్మాణం, జనతా బజార్లు, ప్రాథమికంగా ఆహార ఉత్పత్తుల శుద్ధి, రెండో దశ ప్రాసెసింగ్‌ తదితర అవసరాల కోసం దాదాపు రూ.10,000 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ క్లస్టర్లపై క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు జగన్.  ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లపై పెద్ద ఎత్తున ఖర్చు చేయబోతున్నందున ఆయా యూనిట్లన్నీ అత్యంత నైపుణ్యంతో, పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్‌ విధానంలో పనిచేస్తూ రైతులకు అండగా నిలిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని చెప్పారు. ప్రాసెసింగ్‌ అనంతరం మార్కెటింగ్‌ కోసం ఒప్పందాలు కుదుర్చుకునే సమయంలో విశ్వసనీయత ఉన్న సంస్థలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఎన్నో కష్టనష్టాలకోర్చి వ్యవసాయం చేసే రైతన్నలు.. తమ ఉత్పత్తులను సరిగా మార్కెట్ చేసుకోలేకపోవడం వల్ల దళారులు లాభపడుతున్నారని, ఇకపై అలాంటి విధానం ఉండకూడదనేది సీఎం జగన్ ఆలోచన. అందుకే రైతులకే నిల్వ కేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి తెస్తున్నారు. నిర్దేశిత ధరలకు పంటలను కొనుగోలు చేస్తామని ముందుగానే రైతులకు తెలియజేసి, గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన వాటికి అదనపు విలువ జోడించేందుకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ మార్కెటింగ్‌ విభాగం ప్రాసెసింగ్‌ యూనిట్లకు ముడి పదార్థాలు అందించేలా చూస్తున్నారు. ప్రాసెస్‌ చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్‌ సంస్థలకు అప్పగించి తుదిగా రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: