తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బిజెపిలో చేరబోతున్నారు అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది.  మంచి ఊపు మీద ఉన్న బిజెపి ఇతర పార్టీలలో పేరు, ప్రజాబలం ఉన్న నాయకులు అందరిని తమ పార్టీలో చేర్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ , టిఆర్ఎస్ పార్టీ లను టార్గెట్ చేసుకుని, ఆ పార్టీలో కీలక నాయకులు అందర్నీ బిజెపి లో చేర్చుకునే పనిలో ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఏదోరకంగా బిజెపిలో చేర్చుకోవాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నార ట. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకులు సర్వే సత్యనారాయణ, విజయశాంతి వంటి వారు బీజేపీలో చేందుకు ఢిల్లీకి వెళ్లడంతో,  కాంగ్రెస్ శిబిరంలో సందడి కనిపించడం లేదు.



ఇక చోటామోటా నాయకులు సైతం కాంగ్రెస్ ను వీడి బీజేపీ వైపు వెళ్ళి పోతూ ఉండడంతో, ఆ పార్టీలో కలవరం కనిపిస్తోంది. చేవెళ్ల నేత , మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరిన తర్వాత రాజకీయంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా ఆయన ఖండించారు. అయితే రేవంత్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుపడ్డ కొండా రేవంత్ కు కనుక పిసిసి అధ్యక్ష పదవి వస్తే , కాంగ్రెస్ లో ఉండాలని, లేకపోతే రేవంత్ తో పాటు బిజెపిలో చేరాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న ఈ  పరిస్థితుల్లో రేవంత్ కు పిసిసి ఇస్తారా అనేది అనుమానంగానే ఉన్నా , రేవంత్ మాత్రం కేవలం తన మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని , 45 వార్డుల్లో మాత్రమే గట్టిగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.



అయితే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ , నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వంటివారు టిఆర్ఎస్ పై వాయిస్ పెంచిన తర్వాత , రేవంత్ సైలెంట్ అయినట్టుగా కనిపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ లో రేవంత్ కు కనుక పిసిసి అధ్యక్ష పదవి వచ్చే అవకాశం లేకపోతే,  కచ్చితంగా బిజెపిలోకి మరికొద్ది రోజుల్లోనే చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు టిఆర్ఎస్ ను కలవరానికి గురిచేస్తున్నాయి. మామూలుగానే రేవంత్ దూకుడు తట్టుకోవడం కష్టం అనుకుంటే,  ఆయన బిజెపిలో చేరి మరింతగా తమపై పోరాటం మొదలు పెడతారనే ఆందోళన కనిపిస్తోంది . రేవంత్ బిజెపిలో చేరే విషయమై క్లారిటీ కి రాకపోవడంతో, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ లోనూ ఉత్కంఠ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: