తెలుగు రాష్ట్రాల‌పై విరుచుకుప‌డేందుకు నివ‌ర్ తుపాను దూసుకువ‌స్తోంది. వాయుగుండంగా మారే ప్ర‌మాద‌ముంద‌ని వాతావ‌ర‌ణ నిపుణులు హెచ్చ‌రించిన విష‌‌యం తెలిసిందే. భారీ నుంచి అతిభారీవ‌ర్షాలు కురుస్తాయ‌ని విశాఖ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఏపి, తెలంగాణలో, తమిళనాడు రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా, రేపు తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుపానుకు ఇరాన్ దేశం సూచించిన  ‘నివర్’  అని పేరుపెట్టింది. నివర్ ఎల్లుండి తమిళనాడు, పుదుచ్చేరి తీరంలోని కరైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి, ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.


కోస్తాంధ్రలో ఇప్పటికే వర్ష ప్రభావం ఉందని, రాయలసీమలో రేపటి నుంచి, ఎల్లుండి నుంచి తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాల వెంబడి గంటకు 45 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు, అరేబియా సముద్రంలో ఇప్పటికే ఏర్పడిన ‘గతి’ తుపాను కొనసాగుతోంది. అయితే, ఇది పశ్చిమ తీరానికి దూరంగా ఉన్నప్పటికీ, వర్షం పడే అవకాశం మాత్రం ఉందని చెబుతున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం పుదుచ్చేరికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మరో 24 గంటల్లో వాయుగుండం తుఫాన్‌గా బలపడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.


పుదుచ్చేరిలోని కరైంకల్‌..మామళ్ళపురం మధ్య ఈ నెల 25న తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉంది.  ఇరాన్‌ దేశం ఈ పేరును సూచించింది. ఇప్పటికే ఈ వాయిగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు తమిళనాడు ఉత్తర జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. కొన్ని చోట్ల సాధారణ వర్షాలు మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర‌్షాలు పడనున్నాయి. తాజా తుపాను హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. రైతులు పంట ఉత్ప‌త్తుల‌ను ఇళ్లల్లోకి చేర్చుకోవాల‌ని, వ‌ర్షం నుంచి త‌డ‌వ‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించాయి. ఈ అకాల వ‌ర్షంతో ప‌త్తి, వ‌రి పంట‌లు దెబ్బ‌తింటాయ‌ని రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: