గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈసారి పోరు రసవత్తరంగా సాగనుంది. అన్ని పార్టీలూ అభివృద్ధి ఎజెండాతోనే ముందుకెళ్తున్నాయి. అభ్య‌ర్థుల అంశం క్లారిటీగా తెలిసిపోవ‌డంతో పార్టీలు ప్ర‌చార యుద్ధానికి దిగుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయా అభ్య‌ర్థుల‌తో పాటు స్థానిక ఎమ్మెల్యేలు ప్ర‌చారాల్లో పాల్గొన్నారు. నేటి నుంచి స్టార్ క్యాంపెన‌ర్లు పాల్గొన‌నున్నారు. ఇప్ప‌టికే మంత్రి కేటీఆర్ రోడ్‌షోల‌తో టీఆర్ ఎస్ శ్రేణుల్లో ఊపు తీసుకువ‌చ్చారు. అభివృద్ధి అంశాల‌ను ప్ర‌తిప‌క్షాల‌పైకి ఎక్కుపెడుతూ జ‌నంలోకి దూసుకెళ్తున్నారు. బీజేపీ ఎత్తుగ‌డ‌ల‌ను కూడా ఎండ‌గ‌డుతున్నారంటూ ఆ పార్టీ శ్రేణులు ఆనందం వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి  ఈసారి ఎన్నికల్లో సంపన్నుల నుంచి రాజ‌కీయాల‌తో ఎంత‌మాత్రం సంబంధం లేని వారు కూడా కార్పోరేట‌ర్ సీట్ల‌ను ద‌క్కించుకునేందుకు బ‌రిలో నిల‌వ‌డం గ‌మ‌నార్హం.


 ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగా పోటీచేస్తున్నారు. కోట్లకు పడగలెత్తిన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అభ్యర్థులు, ఉన్నత చదువులు, ఉత్తమ ఆశయాలతో రాజకీయంలోకి అడుగుపెట్టిన మరికొందరు వీరిలో ఉన్నారు. ఈనేప‌థ్యంలోనే కొంత‌మంది వ్యాపారుల సూచ‌న‌ల మేర‌కు స్టార్ క్యాంపెన‌ర్లు వారి వారి డివిజ‌న్ల‌లో ప్ర‌చారం చేసేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. గ్రేటర్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార, ప్రధాన ప్రతిపక్ష పాలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటన, నామినేషన్ల ఘట్టం ఇప్పటికే ముగిసింది. ఎన్నికల గడువు కూడా దగ్గరపడుతోంది. ప్రచారానికి పెద్దగా సమయం కూడా లేదు.


దీంతో  అధికార టీఆర్‌ఎస్‌ సహా బీజేపీ, కాంగ్రెస్‌ ఇతర పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్టార్‌ క్యాంపెయిర్లను రంగంలోకి దింపి హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. రోడ్‌షోలు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఒకవైపు ప్రత్యక్షంగా డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ నిర్వహిస్తూనే స్మార్ట్‌ఫోన్‌లు వాడే యువత, ఉద్యోగులు, వ్యాపారులను ఆకర్షించేందుకు సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పోటాపోటీగా ప్రెస్‌మీట్లు ఏర్పాటు చేస్తూ నేతలు ఇచ్చే హామీలు, మాటల తూటాలను పోస్టులు చేస్తున్నారు. స్టార్ క్యాంపెనర్లు ఎంట్రీ ఇవ్వ‌నుండ‌టంతో ప్ర‌చారంలో వాడి వేడి పెర‌గ‌నుంది. అయితే ప్ర‌చారం మాట ఎలా ఉన్నా.. సైలెంట్‌గా జ‌నం త‌మ తీర్పు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నార‌ని విశ్లేష‌కులు చెబుతుండ‌టం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: