అనంతపురం: అనంతపురం జిల్లాలో అధికార పార్టీ వైసీపీలో వర్గ విభేదాలు రోజురోజుకు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవలే పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి, ఓ మండలస్థాయి నాయకుడి మధ్య విభేదాలు బయటపడ్డాయి. తాజాగా.. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ మధ్య ఉన్న విభేదాలు వెలుగులోకి వచ్చాయి. వారి మధ్య ఎన్ని భేదాభిప్రాయాలున్నపట్టికీ ఏరోజు కూడా బహిరంగంగా విమర్శలు చేసుకోలేదు. అయితే ఆ నియోజకవర్గంలో పార్టీ ద్వితీయశ్రేణి నాయకత్వం, శ్రేణులు ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకుంటున్నారు.

రాష్ట్ర మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం కళ్యాణదుర్గానికి రాక నేపథ్యంలో గొడవలు జరిగాయి. మంత్రికి స్వాగతం పలికేందుకు ఎంపీ వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే అనుచరులు తొలగించడంతో ఈ గొడవలు జరిగాయని తెలిసింది.  ఈ గొడవలు వారిమధ్యే ఆగకుండా మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునే వరకు వెళ్లాయి. దీంతో పోలీసులకు అయోమయ పరిస్థితి నెలకొంది. తన నియోజకవర్గంలో ఏం జరిగినా తనకు తెలిసే జరగాలని ఎమ్మెల్యే ఉషాచరణ్ అన్నారని, ఈ వ్యాఖ్యల వల్లే ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరుకు దారితీసిందని సమాచారం. ఎమ్మెల్యే తన అనుచరులకు తప్ప మరేవరికి అభివృద్ధి పనులు కట్టబెట్టడం లేదని ఎంపీ వర్గీయులు కోపంగా ఉన్నరని తెలిసింది. అంతేకాకుండా ఈ అభివృద్ధి పనులు నియోజకవర్గ ప్రజలకు కాకుండా వేరే ప్రాంత వాసులకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఈ విషయం ఎంపీకి తెలియడంతో ఆయనే నేరుగా రంగంలోకి దిగినట్లు సమాచారం. ఎంపీ ల్యాండ్స్ ద్వారా వచ్చిన నిధుల ద్వారా చేపట్టే అభివృద్ధి పనులను పార్టీ జెండా మోసిన నియోజకవర్గానికి చెందిన వారికే కట్టబెట్టాలేగానీ ఇతర ప్రాంత వాసులకు ఎలా ఇస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. రెండు వర్గాల పోరు వల్ల ఆ నిధులు వృథా అయ్యాయని సమాచారం.

వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు సోమవారం కళ్యాణదుర్గానికి వచ్చిన మంత్రి బొత్స కాన్వాయ్‌ను అడ్డుకునే వరకు ఈ వర్గ విభేదాలు వెళ్లాయి. సొంత పార్టీ శ్రేణుల నుంచే మంత్రి నిరసనను ఎదుర్కోవటం ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కంబదూరులో మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఎంపీ వర్గీయులు, మరోసారి కళ్యాణదుర్గం రింగురోడ్డులో అడ్డుకున్నారు. కళ్యాణదుర్గంలో అయితే, 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి చవిచూసిన ఎంపీ వర్గీయుడు తిప్పేస్వామితోపాటు మరికొందరు నాయకులు, కార్యకర్తలు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వ్యవహార శైలిని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ వర్గీయుల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల నియోజకవర్గ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: