దూకుడు ఉండాలి. ఆవేశం కూడా కావాలి. నిజానికి వీటికే మాస్ అప్పీల్ బాగా ఉంటుంది. అయితే సమయం సందర్భం కూడా ముఖ్యం. అయిన దానికీ కానిదానికీ ఆవేశపడితే ఇబ్బందే. తెలంగాణా బండిని బండి సంజయ్ చేతుల్లో పెట్టాక బీజేపీకి కొత్త ఊపు వచ్చింది అన్నది వాస్తవం. అయితే అదే తారకమంత్రం అయితే మాత్రం బీజేపీ బండి తారు రోడ్డు దిగిపోయి  గతుకుల్లోనే పడుతుంది అంటున్నారు. ఆలోచనతో కూడా అడుగులు వేయాల్సిన తరుణం ఇది. నిజానికి దుబ్బాక ఉప ఎన్నికల తరువాత బీజేపీకి రెట్టింపు జోష్ వచ్చింది. ఇక తరువాత టార్గెట్  సీఎం సీటే అన్నట్లుగా హడావుడి కనిపించింది. అయితే అది అంత సులువు కాదు అంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ముందు మూడు నెలలకు జరిపి కేసీయార్ రాజకీయ చాణక్యం ప్రదర్శించారు. అన్ని వర్గాలకు వరాల జల్లులను కూడా ఆయన కురిపించేస్తున్నారు. ఇక వరదల వల్ల నష్టపోయిన వారికి పదివేల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బలమైన వర్గాలను, వ్యవస్థలను టీయారెస్ తన దరి చేర్చుకుంటోంది.

టాలీవుడ్ ని దగ్గరకు తీయడంతో కేసీయార్ వేసిన మాస్టర్ ప్లాన్ గ్రేట్ అని చెప్పుకోవాలి. అదే సమయంలో రాజమౌళి తీస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్టీయార్ భీం గెటప్ లో ముస్లిం టోపీ మీద హాట్ హాట్ కామెంట్స్ చేసి బండి సంజయ్ టాలీవుడ్ పెద్దలకు కన్నెర్ర అయ్యాడు. ఇక ఇపుడు చూస్తే ఒకరిద్దరు తప్ప అంతా కూడా టీయారెస్ వైపు ఉంటున్నారు. దాంతో సినీ మద్దతుని బీజేపీని సంపాదించడంలో సంజయ్ వెనకబడ్డారని అంటున్నారు.

ఇదిలా ఉంటే మజ్లీస్ మీద యుద్ధం పాత బస్తీలో సవాల్ అంటూ బండి సంజయ్ చేస్తున్న దూకుడు గ్రేటర్ హైదరాబాద్ లో నెగిటివ్ ఫలితాలు ఇస్తుందేమో అన్న చర్చ సాగుతోంది. నిజానికి గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని వర్గాలు కలసి మెలసి ఉంటున్నాయి. ఎవరి మధ్యన పొరపొచ్చాలు లేవు. అతి సున్నితమైన అంశాలను ఇపుడు కెలకడం అవసరమా అన్నది బండి సంజయ్ ఆలోచన చేయాలి మరి. ఇక ఇప్పటికే మంత్రి కేటీయార్ ఒక మాట అన్నారు. ప్రశాంత హైదరాబాద్ లో మత కలహాలు వద్దు అని. మరి ఆ ట్రాప్ లో పడినట్లుగా సంజయ్ చేస్తున్న దూకుడు వ్యాఖ్యలు చివరికి బీజేపీ విజయం మీద ప్రభావం చూపిస్తే ఆ తప్పు కమలానిది కాదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: