హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరినీళ్లలా మారుస్తామని, హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మిస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు నిర్మించలేదో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తమ్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరి నీళ్లలా మారుస్తామని చెప్పారు.. అదేమైందని  ప్రశ్నించారు. టీఆర్ఎస్ హామీల పట్ల నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓట్ల కోసం టీఆర్ఎస్ అబద్ధపు హామీలిస్తోందన్నారు.

‘‘సెలూన్లకు ఉచిత విద్యుత్ హామీని గతంలో ఎన్నోసార్లు చెప్పారు. ఇలా చెప్పినవే మళ్లీ మళ్లీ చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో ఉచిత వైఫై సేవలు అందిస్తామని చెప్పారు. అయితే ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు’’అని తీవ్రంగా మండిపడ్డారు. నగరంలో రెండు పడకల గదుల ఇళ్లు లక్ష వరకు కట్టిస్తామన్నారని, ఇప్పటివరకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘నాలాల ఆధునికీకరణ గురించి గతంలో ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఏం చేయలేక పోయారు. నిమ్స్ ఆసుపత్రి పరిస్థితిని దిగజార్చి బస్తీ దవాఖానాల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు’’అని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అసమర్థత వల్లే హైదరాబాద్ వరదల్లో మునిగిపోయిందని అన్నారు. వరద బాధిత కుటుంబాల్లో ఒక్క కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌కు మెట్రో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని , ఇక్కడ అభివృద్ధిని పరిచయం చేసింది తామే అని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ అభివృద్ధిని కనీసం కొనసాగించలేకపోయిందని విమర్శించారు. పాతబస్తీ వరకు మెట్రోను ఎందుకు తీసుకెళ్లలేకపోయారు అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత మర్చిపోవడం టీఆర్ఎస్‌కు, కేసీఆర్ కు మామూలే అని అన్నారు. టీఆర్ఎస్‌ను, ఆ పార్టీ మేనిఫెస్టోను ప్రజలు చెత్తబుట్టలో పడేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: