జిహెచ్ఎసి 2020 ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు విడుదల చేసింది.. వరద బాధిత కుటుంబాలకు ప్రతి కుటుంబానికి రూ. 50,000. పూర్తిగా దెబ్బతిన్న గృహాలకు రూ. 5 లక్షల చొప్పున మరియు పాక్షికంగా దెబ్బతిన్న వాటికి రూ. 2.5 లక్షల చొప్పున సహాయం చేస్తామని పేర్కొంది. భారీ వర్షాలు, వరదలలో చనిపోయిన ప్రతివ్యక్తి కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పింది. వరదలు మరియు విపత్తు నిర్వహణ ఎన్డిఎంఎ మార్గదర్శకాలను అమలు చేస్తాం అని పేర్కొంది.

హైదరాబాద్ కు విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించి క్రమం తప్పకుండా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తాం అని చెప్పింది. డాప్లర్ వెదర్ రాడార్ చిత్రాల సహాయంతో వర్షాన్ని, అదేవిధంగా వర్షపాతాన్ని 3-6 గంటల ముందే ఎంత పడుతుందో అంచనావేసి అందుకు అనుగుణంగా సమాచార వ్యవస్థలను శక్తివంతంగా ఉపయోగించుకొని ప్రజలందరికీ సమాచారం అందించడం, ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని వనరులను సమకూర్చుకొని సంసిద్ధం కావడం జరుగుతుందని హామీ ఇచ్చింది.

కోవిడ్-19 చికిత్సను 'ఆరోగ్యశ్రీ' పథకంలో చేరుస్తాం అని పేర్కొంది. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన ఉంటుంది అని పేర్కొంది. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ మరియు ఇతర ఆసుపత్రులను ప్రత్యేకంగా మెరుగుపరుస్తాం అని చెప్పింది. బస్తీ దవాఖానాల సంఖ్యను 450కి పెంచుతాం అని పేర్కొంది. బస్తీలలో ఆసుపత్రి పనివేళలను రాత్రి 9 వరకు పెంచుతాం అని వెల్లడించింది. అన్ని ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా వైద్య పరీక్షలు, ఉచిత ఔషధాలు అందజేస్తామని చెప్పింది.

మహిళలకు, విద్యార్థులకు, దివ్యాంగులకు, వృద్ధులకు ఆర్టీసీ బస్సులు, మెట్రో ఎంఎంటిఎస్లలో ఉచిత రవాణా సదుపాయం (నగరంలో) ఉంటుంది అని చెప్పారు. ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచుతాం. జిహెచ్ఎంసి పరిధిలోని చివరి కిలోమీటర్ వరకు ఆర్టీసీ బస్సుల సేవలను విస్తరిస్తాం అని చెప్పారు. మెట్రో రైలు సేవలను, ఎంఎంటీఎస్ సర్వీస్లను పాతనగరం, శంషాబాద్ విమానాశ్రయం వరకు విస్తరిస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: