ఏపీలో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్...వైసీపీ ప్రభుత్వంల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతున్న విషయం తెలిసిందే. గత మార్చిలో నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా స్థానిక సంస్థల ఎన్నికలని వాయిదా వేసిన దగ్గర నుంచి, వైసీపీ నేతలు నిమ్మగడ్డని గట్టిగా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అసలు అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరుగుతూ వచ్చిందో అందరికీ తెలిసిందే.

ఇక ఇప్పుడు నిమ్మగడ ఎన్నికలు పెట్టడానికి సిద్ధమవుతుంటే, దానికి వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. అసలు నిమ్మగడ్డ చంద్రబాబు లైన్‌లోనే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. నిమ్మగడ్డ, చంద్రబాబులది ఒకే సామాజికవర్గమని అందుకనే, స్థానిక ఎన్నికలు టీడీపీకి అనుకూలంగా జరగనున్నాయని మాట్లాడుతున్నారు. అయితే నిమ్మగడ్డ వచ్చే మార్చిలో రిటైర్ అయిపోతారు. అందుకే ఆయన రిటైర్ అయ్యాక, ఎన్నికలు పెట్టుకోవాలని వైసీపీ నేతలు, ఇప్పుడు కరోనా ఉండగా ఎన్నికలు ఎలా పెడతారని చెబుతున్నారు.

అయితే ఎన్నికలు నిర్వహించాలని అనుకున్న నిమ్మగడ్డకు వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం రావడం లేదు. ఇదే సమయంలో నిమ్మగడ్డ కోర్టు ద్వారా ముందుకెళ్లాలని చూస్తున్నారు. ఇక ఇందులో చంద్రబాబు సపోర్ట్ కూడా ఉందని వైసీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి. పైగా తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మగడ్డకు లేఖ రాయడంపై కూడా వైసీపీ అనుమానం వ్యక్తం చేస్తోంది.

తాజాగా అచ్చెన్న లేఖలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు సృష్టించిన వీరంగంపై సీబీఐ విచారణ జరగాలని కోరారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేయాలని, ఆన్‌లైన్‌లో నామినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని, కేంద్ర భద్రతా దళాల సహకారంతో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని విన్నవించారు.  ఇలా చేస్తే టీడీపీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. ఇక నిమ్మగడ్డ కూడా  ఇదే లైన్‌లో వెళ్ళి జగన్‌కు షాక్ ఇవ్వొచ్చని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: