వైసీపీ ప్రభుత్వం పై అన్ని రకాలుగా పైచేయి సాధించేందుకు టిడిపి అధినేత చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ క్రమంలోనే పార్టీ నాయకుల్లో ఉత్సాహం నింపేందుకు ఆయన అన్ని రకాలుగానూ ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల తో పాటు, పార్లమెంట్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా ఏంటో చూపించాలని కోరారు. ఈరోజు టిడిపి మండల కమిటీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. 



ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కునేందుకు ధైర్యంగా ఉండడంతోపాటు, రాష్ట్ర సమస్యలపైన ఎక్కడికక్కడ ఆందోళన నిర్వహిస్తూనే , ప్రతి మండలంలోనూ స్థానిక సంస్థల పరిష్కారంపై రాజీలేని పోరాటం చేయాలని సూచించారు. అలాగే ఎక్కడికక్కడ వైసీపీ ప్రభుత్వం లోని అవినీతి వ్యవహారాలను ప్రజల ముందుకు తీసుకు వచ్చి , ఆ పార్టీని దోషిగా చేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో నష్టపోయామని, టిడిపి ప్రభుత్వం ఉండి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది అని, ఇలా ఎన్నో విషయాలను కార్యకర్తలకు నూరిపోశారు.



ప్రస్తుతం హైదరాబాద్ కే పరిమితం అయిపోయిన బాబు అక్కడి నుంచే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు,  ఏపీలో త్వరలో జరగనున్న అన్ని ఎన్నికల్లోనూ సత్తా చాటే విధంగా ఇప్పటి నుంచే అన్ని రకాలుగానూ కసరత్తులు మొదలు పెడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే బాబు కు ఉన్నంత కసి, పట్టుదల కార్యకర్తల్లో ప్రస్తుతం కనిపించడం లేదు. అలాగే ప్రజలలోనూ, వైసీపీ ప్రభుత్వం పై ఎక్కడ వ్యతిరేకత వస్తున్నట్టుగా కనిపించకపోవడం వంటివి టీడీపీ శ్రేణులకు మింగుడుపడని అంశాలే.


మరింత సమాచారం తెలుసుకోండి: