ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి ఉప ఎన్నిక రాజకీయం క్రమక్రమంగా రసవత్తరంగా మారుతోంది.  అధికార, ప్రతిపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలతో ఎన్నికల వేడి రాజేస్తున్నారు. ఈ తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి అందరి కంటే ముందుగా తెలుగు దేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. అయితే పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించినా ఇప్పటి వరకు ఆమె మీడియాకు గాని, టీడీపీ శ్రేణులకు గాని అందుబాటులో రాలేదు. దీంతో పనబాక లక్ష్మి టీడీపీ తరఫున ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదంటూ వైసీపీ శ్రేణులు ప్రచారం మొదలు పెట్టారు. ఏకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీకి అభ్యర్థి దొరకడం లేదంటూ బాంబు పేల్చారు.

‘‘అకటా.. 32 ఏళ్ల పచ్చ పార్టీకి ఇంత కష్టం వచ్చిపడిందా? తిరుపతి బైఎలక్షన్‌కు అభ్యర్థి దొరకడం లేదట. టికెటిచ్చి కోట్లు కుమ్మరించేందుకు సిద్ధపడినా ఎవరూ ముందుకు రావడం లేదు. స్థానిక ఎన్నికల్లో ఇదే దరిద్రం జిడ్డులా పట్టుకుంటే నిమ్మగడ్డతో వాయిదా వేయించి తప్పించుకున్నాడు. ఇప్పుడెలా?’’ అంటూ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు.

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలతో టీడీపీలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఇది జరిగిన గంటలోనే విజయసాయిరెడ్డికి టీడీపీ షాకిచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది. తిరుపతి ఉప ఎన్నికలో పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారని టీడీపీ తేల్చి చెప్పింది. మంగళవారం టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పనబాక లక్ష్మితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని నివాసంలో పనబాక దంపతులను కలసి మాట్లాడారు. కుమార్తె నిశ్చితార్థ పనుల్లో బిజీగా ఉండటం వల్లే పనబాక లక్ష్మి అందుబాటులోకి రాలేదని వెల్లడించారు.

‘‘తిరుపతి ఎంపీ ఉప ఎన్నికపై ఈ రోజు చర్చించుకున్నాము. పనబాక లక్ష్మి, కృష్ణయ్య గార్ల దంపతులు మొన్న 21వ తేదీన కుమార్తె వివాహ నిశ్చితార్థం కావడంతో ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. ఎల్లుండి చంద్రబాబునాయుడు గారితో సమావేశమవుతారు. మంచి రోజు చూసుకుని ప్రచారం ప్రారంభిస్తారు. అధికార పార్టీ అరాచకాలు, కక్షసాధింపులతో విసిగి వేసారిన ప్రజానీకం టీడీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.’’ అని reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.

దీంతో తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి నెలకొన్న గందరగోళానికి టీడీపీ ఫుల్‌స్టాప్ పెట్టిందని చెప్పవచ్చు. పనబాక లక్ష్మి ఉప ఎన్నికలో పోటీ చేయడం ఫిక్స్ కావడంతో ఇక ప్రచారం జోరందుకోనుంది. ఇక, అధికార వైసీపీ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ, జనసేన తరఫున ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. మరో రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.





మరింత సమాచారం తెలుసుకోండి: