ప్రధాని నరేంద్రమోదీ కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా.. ఇతర రాష్ట్రాల సీఎంలు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని తమ సన్నద్ధత ప్రకటించారు. తమ రాష్ట్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకోసం సిద్ధం చేసిన ప్రణాళికను వివరించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక తొలి దశలో ఎవరికి ఇవ్వాలి, ఎవరి ద్వారా పంపిణీ చేయాలి, ఎక్కడ నిల్వ చేయాలి, వ్యాక్సిన్ వేయడానికి ఉపయోగించే మెడికల్ కిట్లను ఎక్కడినుంచి సమకూర్చుకోవాలి అనే అంశాలపై దాదాపు అన్ని రాష్ట్రాలు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

ఏపీలో కూడా కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై ఇప్పటికే అధికారులు పలు దఫాలు సమావేశాలు ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లతో చర్చించారు. ఈ నేపథ్యంలో వీరందరికీ మరోసారి సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ సన్నద్ధతపై సరైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్‌ పంపిణీలో ఎలాంటి పద్ధతులు అనుసరించాలనే దానిపై దృష్టి పెట్టాలని, వ్యాక్సిన్‌ సంబంధిత అంశాలపై కూడా ఒక సమీక్ష నిర్వహించాలని చెప్పారు.

కోవిడ్‌ వ్యాక్సిన్ ‌పై ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో జగన్ పాల్గొన్నారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వ్యాక్సిన్‌ పంపిణీలో అనుసరించే శీతలీకరణ పద్ధతులు, వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలు, తదితర అంశాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. నిర్దిష్ట ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్‌ ను నిల్వ చేయడంతో పాటు అదే ఉష్ణోగ్రతలో మారుమూల ప్రాంతాలకు దాన్ని తరలించడం కీలకమని చెప్పారు. దీనిపై కూడా నిర్దిష్ట ప్రణాళిక ఉండాలని అన్నారు. ఆయా అంశాలపై సాంకేతిక సమాచారం సేకరించాలని, వివిధ కంపెనీల నుంచి కూడా సంబంధిత సమాచారం తీసుకుని అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: