కర్ర విరగదు పాము చావదు అన్నట్టుగా జనసేన బీజేపీ పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం ఏ క్లారిటీ లేకుండా పోయినట్టుగా కనిపిస్తోంది. అన్ని విషయాలపైనా ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటూ , కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన బిజెపి జనసేన పార్టీలు ఎవరికివారే యమునాతీరే అన్నట్లు వ్యవహరిస్తూ వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. పైగా రెండు పార్టీల మధ్య అసలు పొత్తు ఉందా లేదా అనే అనుమానం అందరిలోనూ రేకెత్తిస్తూ, మరింత గందరగోళానికి కారణం అవుతున్నారు. 2019 ఎన్నికల్లో ఫలితాల దగ్గర బోల్తా కొట్టడంతో, ముందు ముందు ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో బిజెపి తో జనసేన పొత్తు పెట్టుకుంది. అయితే అప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ రెండు పార్టీల మధ్య పెద్దగా సఖ్యత కుదరడం లేదు అన్నట్లుగా పరిస్థితి ఉంది.


 ఎవరికి వారే విడివిడిగా అజెండాను రూపొందించుకొని వెళ్లడం , ఒకరు తీసుకునే నిర్ణయాలపై మరొకర్ని సంప్రదించకుండానే ముందుకు వెళ్తున్న తీరు వంటివెన్నో జరుగుతున్నాయి. పవన్ మాత్రం బిజెపి అండదండలతోనే గట్టెక్కాలని చూస్తుండగా, ఆ పార్టీ పెద్దగా పట్టించుకోనట్లు వ్యవహరిస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. బిజెపి తో పొత్తు పెట్టుకున్న పవన్ తనకు అవసరమైన సందర్భాల్లో ఉపయోగపడటం లేదని, కీలకమైన సమయంలోనూ పవన్ అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారని, బిజెపి ఓ రేంజ్ లో ఫైర్ అవుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారానికి పవన్ వస్తారని బిజెపి ఆశలు పెట్టుకున్న, ఆయన మాత్రం సైలెంట్ గా ఉండడం బిజెపి నేతలకు మింగుడుపడలేదు.



 అలాగే గ్రేటర్ ఎన్నికల్లో ముందుగా బీజేపీకి మద్దతు ఇవ్వకుండా,  కనీసం సంప్రదించకుండా ఎన్నికల బరిలోకి దిగడం, ఆ తర్వాత బీజేపీ నాయకులు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం పవన్ పై బిజెపి నేతలకు ఆగ్రహం కలిగిస్తున్నాయి.ఇదిలా ఉంటే, ఇప్పుడు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల లో తాము పోటీ చేస్తున్నట్టు బిజెపి ప్రకటించేసింది. అయితే అక్కడ జనసేన పోటీలో నిలవాలని చూస్తోంది. ఈ విషయంపై క్లారిటీ తెచ్చుకునేందుకు పవన్ ఢిల్లీ కి వెళ్ళినా, కేంద్ర పెద్దల నుంచి ఇప్పటి వరకు ఏ హామీ అయితే పొందలేకపోయారు.ఏపీలో మిత్రపక్షంగా ఉన్న జనసేన సంప్రదించకుండానే అక్కడ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధమని బిజెపి ఏక పక్షంగా ప్రకటించడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు. 



ఏది ఏమైనా ప్రస్తుతం జనసేన బిజెపి బంధం పైన నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉండకుండా, సినిమాల వైపు వెళుతుండటం, తమను సంప్రదించకుండానే కీలక నిర్ణయాలు తీసుకోవడం బిజెపి నేతలకు ఆగ్రహం కలిగిస్తోంది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలలో ఎవరు త్యాగం చేస్తారు అనే దానిపైన ఇప్పుడు రెండు పార్టీల మధ్య పొత్తు ఆధారపడి ఉండేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: