ఒకపక్క తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఒక రేంజ్ లో ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ప్రచారంలో భాగంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇక ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శించుకుంటున్నారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ విషయమై ఏపీ మాజీ సీఎం మాట్లాడుతూ... రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే గెలవలేమనే భయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు పట్టుకుందని తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు విమర్శించారు. ఇప్పుడు ఎలక్షన్స్ నిర్వహిస్తే బాధిత వర్గాలన్నీ కలిసి వైసీపీని ఓడిస్తాయనే భయంతోనే ఎన్నికలకు వెళ్లడం లేదన్నారు. వైసీపీని ఇప్పటికైనా వదిలించుకోకపోతే రాష్ట్రానికి పట్టిన పీడ వదలదని వ్యాఖ్యానించారు. మండల స్థాయి పార్టీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు.



వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏ వర్గానికి ఎంత నష్టం జరిగిందనే విషయాలను ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. ఎలాంటి నేరాలు చేయకుండానే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజాబలం ముందు నియంతలందరూ తల వంచాల్సిందేనని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ బాధితులంతా ఏకమై నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే 'ఐదు సంవత్సరాల్లో చేయాల్సిన అప్పును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఏడాదిలోనే చేశార'ని చంద్రబాబు మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతా కలిసికట్టుగా రాష్ట్రాన్ని, భావితరాల భవిష్యత్తును కాపాడుకోవాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈవిధంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలను అధికార వైసీపీ ప్రభుత్వం ఎలా తిప్పి కొట్టనుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: