తిరుపతి లోక్ సభ టికెట్ వ్యవహారంపై తేల్చుకోడానికే పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారనేది ప్రాథమిక సమాచారం. అయితే ఇప్పటి వరకూ అక్కడ పవన్ ఎవర్నీ కలవలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ జరుగుతుందని అంటున్నారు కానీ తొలిరోజు అది సాధ్యం కాలేదు. ఇక రెండోరోజైనా పవన్ బీజేపీ పెద్దల్ని కలుస్తారా, తన పంతం నెగ్గించుకుంటారా అనేది తేలాల్సి ఉంది. ఒకరకంగా గ్రేటర్ బరిలోనుంచి తప్పుకుని బీజేపీకి సాయం చేసిన పవన్, అదే సాయాన్ని తాను కూడా పొందాలనుకుంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టికెట్ తన పార్టీకి ఆశిస్తున్నారు.

ఏపీలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికకు ఇప్పటికే టీడీపీ, వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించగా.. జనసేన, బీజేపీ మాత్రం ఇంకా ప్రకటించలేదు. గ్రేటర్ ఎన్నికల నుంచి బీజేపీ కోరికపై తప్పుకున్నందువల్ల తిరుపతి ఎంపీ స్థానం జనసేనకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పాలకొల్లులో ఓడిపోయినా తిరుపతి అసెంబ్లీ నుంచి గెలిచారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గంలో జనసేన కు భారీగా ఓట్లు పోలయ్యాయి. దీనికి తోడు పవన్ సామాజికవర్గం కూడా ఈ ప్రాంతంలో ఎక్కువే. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని జనసేనకు టికెట్ కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరే అవకాశం ఉంది.

అటు బీజేపీ కూడా జనసేన సత్తా ఏంటో తెలుసుకోడానికి తిరుపతి టికెట్ ఆఫర్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే.. తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో జనసేన బరిలో దిగితే పవన్ ఏపీ పాలిటిక్స్ లో హీరో కావడం ఖాయం. తిరుపతిలో గెలిచినా, గెలుపు అంచుల వరకు వచ్చి ఓడినా, కనీసం టీడీపీని వెనక్కి నెట్టినా మానసికంగా అది జనసేనకు పెద్ద బలం అవుతుంది. భవిష్యత్తులో బీజేపీ, జనసేన కూటమిపై జనంలో అంచనాలు పెరుగుతాయి. అందుకే పవన్ కల్యాణ్ తిరుపతి టికెట్ కోసం ఆశపడుతున్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో త్యాగాలు, ఓటములతోనే పవన్ కు కాలం సరిపోయింది. జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక కూడా పవన్ ని కాదనుకుని వెళ్లిపోయారు. ఈ దశలో పవన్ కి తిరుపతి ఎన్నిక పెద్ద సవాల్ గా మారింది. ఎన్నిక కంటే ముందు కనీసం టికెట్ సాధించుకోగలిగినా పవన్ ఇమేజ్ పెరుగుతుంది. ఆ తర్వాత బీజేపీ అండతో తిరుపతిలో జనసేన అభ్యర్థి పాగా వేయగలిగితే.. ఏపీలో పవన్ పొలిటికల్ హీరో అవుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: