ఇటీవలే గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా లవ్ జిహాద్, మతాంతర వివాహాలపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తుంది. ఈ విషయమై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఉత్తర ప్రదేశ్‌ బీజేపీ ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. పెళ్లి కోసం చట్టవిరుద్ధంగా మత మార్పిడులకు పాల్పడే వారిపై కొరడా ఝళిపిస్తూ కొత్త చట్టం చేసింది. ‘మత మార్పిడుల వ్యతిరేక బిల్లు 2020’కి యోగి ఆదిత్య నాథ్ యూపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక బలవంతపు మత మార్పిడికి పాల్పడే వారికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించనున్నారు.

ఉత్తర్ ప్రదేశ్‌లో ఇకపై ఎవరైనా పెళ్లి కోసం ఇతర మతం మారాలనుకుంటే జిల్లా మేజిస్ట్రేట్‌ నుంచి 2 నెలల ముందు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలో మంగళవారం (నవంబర్ 24) మంత్రిమండలి సమావేశమై ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. అనంతరం మంత్రి ఎస్‌ సింగ్‌ వివరాలను వెల్లడించారు. ఈ బిల్లు అమల్లోకి వచ్చిన నాటి నుంచి పెళ్లి కోసం చట్టవిరుద్ధంగా బలవంతపు మత మార్పిడికి పాల్పడే వారికి 1 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు, రూ.15 వేల జరిమానా విధిస్తారు. ఒకవేళ మైనర్లు, దళిత, గిరిజన యువతులను, మహిళలను బలవంతంగా మతమార్పిడికి గురిచేస్తే 3 నుంచి పదేళ్ల జైలు శిక్షతో పాటు, రూ.50 వేల జరిమానా విధిస్తారు. ఆర్డినెన్స్‌ ద్వారా ఈ బిల్లును చట్టం రూపంలో అమల్లోకి తీసుకురావాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. మధ్యప్రదేశ్, అసోం లాంటి ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా లవ్‌ జిహాద్‌, మతమార్పిడిలకు వ్యతిరేకంగా చట్టం రూపొందించే యోచనలో ఉన్నాయి. హర్యానా కూడా ఇలాంటి యోచనలో ఉంది. ఈవిధంగా అయినా దేశంలో మత మార్పిడులు తగ్గుతాయని కొందరు విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: