ప్రభుత్వాలు మారినా, ఎన్ని కొత్త ప్రణాళికలు వేసినా ఇసుక విధానంలో మాత్రం ఓ స్థిరమైన నిర్ణయానికి రాలేకపోతున్నారు అధికారులు. గత ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తామంటూ కొన్నాళ్లు మురిపించింది, ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఆ బాధ్యత అప్పగించి విఫలమైంది. తాజాగా వైసీపీ సర్కారు కూడా ఇసుక విధానంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోంది. ఇసుకను ఆన్ లైన్ విధానంలో అమ్మే ప్రక్రియ ప్రారంభించిన వైసీపీ సర్కారు అది కుదరకపోవడంతో ఆఫ్ లైన్ వ్యవహారానికొచ్చింది. కొన్ని రోజుల్లో నూతన విధానం ప్రకటించే అవకాశముంది. అయితే ఇందులో కూడా లోటుపాట్లు ఉన్నాయని, ఇసుక రేటు అమాంతంగా పెరిగిపోతుందని, పేద, మధ్యతరగతి వారికి ఇసుక అందుబాటులో ఉండదనే అనుమానాలున్నాయి.
ప్రస్తుతం టన్ను ఇసుక ధర రూ.375 చొప్పున ఏపీఎండీసీ ద్వారా అమ్ముతుండగా.. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మార్పుల వల్ల ఇది మరింత భారం అయ్యే అవకాశం ఉంది. కేంద్ర సంస్థ ద్వారా విక్రయాలు చేపడితే టన్నుకు గరిష్ఠంగా మరో రూ.100 చొప్పున పెరగుతుందని అంచనా. అంటే టన్ను ఇసుక రేటు 475 రూపాయలు అవుతుందని అంటున్నారు.

కొత్త ధర అమల్లోకి వస్తే 12 టన్నుల సామర్థ్యం ఉండే లారీ ఇసుక ధర అదనంగా రూ.1,200 పెరుగుతుంది. నాలుగున్నర టన్నుల ట్రాక్టర్‌కు రూ.450 చొప్పున పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలకు రెండు కేంద్ర సంస్థలు ముందుకు రాగా, వీటిలో ఓ సంస్థను ప్రభుత్వం త్వరలోనే ఎంపిక చేస్తుందని సమాచారం. టన్ను ధర గరిష్ఠంగా రూ.475కి విక్రయించేలా నిబంధన రూపొందిస్తోంది. ఇది ప్రస్తుత ధర కంటే రూ.100 అదనం. రాష్ట్రంలో ఏటా సుమారు 2 కోట్ల టన్నుల ఇసుక విక్రయం జరుగుతుంది. పెరిగే ధరల ప్రకారం లెక్కిస్తే ఏటా వినియోగదారులపై రూ.200 కోట్ల భారం పడుతుంది.

పరోక్షంగా నిర్మాణాల వ్యయం ఏపీలో మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలపై ఈ భారం మరింత ఎక్కువ అవుతుంది. దీంతో కొత్త విధానంలో కూడా కొన్ని మార్పులు చేయాలని, అందరికి అందుబాటులో ఉండేలా ఇసుక రేటు నిర్ణయించాలని సామాన్యులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: