మన అమరావతి రాజధాని ఇపుడు ఏపీని మరిగిస్తున్న అతి పెద్ద అంశం. ఏపీలో మూడు రాజధానుల వివాదం గత ఏడాదిగా రగులుతూనే ఉంది. మరి అటువంటి అమరావతి రాజధానిని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయుధంగా చేసుకుంటున్నారా అంటే అవును అనే సమాధానం వస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో వందకు వందా సీట్లు గెలిచి సత్తా చాటాలని అధికార టీయారెస్ భావిస్తోంది. అందుకోసం బలమైన  ఆస్త్రాన్నే బయటకు తీసింది. అదే అమరావతి రాజధాని. ఒక విధంగా అది ఆంధ్రుల సెంటిమెంట్. రాజధాని విషయంలో ఆంధ్రులకు ఉన్న సెంటిమెంట్ ని మరింతగా రాజేయడానికి టీయారెస్ రెడీ అయిపోయింది.

పైగా ముప్పై లక్షల ఓట్లు ఆంధ్రులవి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఉన్నాయి. దాదాపుగా యాభై నుంచి అరవై డివిజన్లలో  వారి ప్రభావం ఉంది. దాంతో అమరావతి రాజధాని అంటూ మోడీ మీద బీజేపీ మీద తీరని ద్వేషాన్ని రగిలించడానికి మంత్రి కేటీయార్ తెలివిగానే పాచిక వేశారని అంటున్నారు. మరో వైపు చూసుకుంటే బీజేపీ భూతల స్వర్గంగా హైదరాబాద్ ని మార్చేస్తామంటూ పెద్ద మాటలే మాట్లాడుతోంది. అది వట్టిది అని నిరూపించడానికి టీయారెస్ కావాలనే ఆంధ్రా రాజధాని సమస్యను తెచ్చిందని అంటున్నారు. మరి దీనికి కమలనాధుల దగ్గర సరైన సమాధానం ఉందా అన్నదే ప్రశ్న.


హైదరాబాద్ కి అంత చేస్తాం, ఇంత చేస్తామని చెబుతున్న బీజేపీ పొరుగు రాష్ట్రం ఏపీలో అమరావతి రాజధానికి ఏం చేసిందని కేటీయార్ లాజిక్ పాయింటే తీశారు. అమరావతి రాజధాని శంఖుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ మట్టి నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ఇది ఒక విధంగా ఆంధ్రుల సానుభూతిని గెలుచుకోవడానికి మరో వైపు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు బీజేపీ గ్రేటర్ లో  ఏమీ చేయదు అని చెప్పడానికి. మొత్తానికి కేటీయార్ రగిలించిన  అమరావతి రాజధాని సెంటిమెంట్ ఏ విధంగా ఓట్ల పంట పండిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: