బీజేపీది ఉడుం పట్టు. ఫలితం వస్తుంది అనుకుంటే ఎంతదాకా అయినా వెళ్తుంది. అది దుబ్బాక ఉప ఎన్నికతో రుజువు అయింది. అక్కడ ఒక విషయం కూడా కచ్చితంగా తెలిసిపోయింది. అదేంటి అంటే అధికార టీయారెస్ మీద జనాల్లో వ్యతిరేకత ఉంది అని. సరైన దమ్ము చూపించిన పార్టీ వైపు జనం చూస్తారని అని కూడా బీజేపీకి అర్ధమైంది. మరి ఇంతలా తెలిసాక కమలదళం  చడీ చప్పుడూ చేయక అసలు  ఊరుకుంటుందా. అందుకే బీజేపీ గ్రేటర్ ఎన్నికలు అని ప్రకటించడ‌మేంటి రెచ్చిపోతోంది. ఒక్క లెక్కన దూకుడు చేస్తోంది.

నిజానికి గతలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి మూడంటే మూడు డివిజన్లు మాత్రమే దక్కాయి. ఈసారి ఆ సంఖ్యను కనీసం యాభై దాకా చేయాలన్నది బీజేపీ ప్లాన్. అందుకోసం బీజేపీ సర్వ శక్తులూ ఒడ్డుతోంది. ఢిల్లీ నుంచి నేతలను గల్లీ దాకా తీసుకువస్తోంది. బీజేపీకి ఇప్పటిదాకా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. రానున్న రోజుల్లో వరసగా కేంద్ర మంత్రులు దిగిపోతారని అంటున్నారు.

ఈ మధ్యనే కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ హైదరాబాద్ వచ్చి టీయారెస్ మీద మజ్లీస్ మీద బాణాలు వేశారు. ఇక మీదట పార్టీ జాతీయ నాయకులు దిగిపోతారని అంటున్నారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా బీజేపీ ప్రచారంలోకి వస్తారని చెబుతున్నారు. ఆఖరుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా బీజేపీ ప్రచారానికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.

మరి ఇంతమంది వచ్చాక బీజేపీ కనీసం గ్రేటర్ లో  ప్రధాన ప్రతిపక్షంగా అయినా రావాలి. ఆ మేరకు ఓట్లను గణనీయమైన సీట్లను సంపాదించుకోవాలి. మరి బీజేపీ అటు టీయారెస్ ని ఇటు మజ్లీస్ ని కూడా గురి పెట్టి సాగుతోంది. కమలం వేసే బాణాలకు ఏ పార్టీ ఓట్లకు చిల్లు పడతాయో వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా కాషాయదళం పంతం మీదే ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: