గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అన్ని పార్టీలకు చావో రేవో అన్నట్లుగా మారాయి. నిజానికి గ్రేటర్ లో దాదాపు కోటి మంది జనాభా ఉన్నారు. ఇందులో 80 లక్షల మందికి ఓటు హక్కు ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేసే ఎన్నిక అంటే చాలా ప్రాముఖ్యత ఉన్నదాని కిందనే లెక్క. ఒక మినీ అసెంబ్లీ ఎలక్షన్ మాదిరిగా గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్నాయి.

గతంలో అంటే వైఎస్సార్ సీఎంగా ఉన్నపుడు గ్రేటర్ హైదరాబాద్ మీద కాంగ్రెస్ జెండా ఎగిరింది. నాడు కాంగ్రెస్ కి హైదరాబాద్ నిండా బలమైన నాయకులు ఉండేవారు. అటు  నుంచి ఇటు వారు చాలా బాగా కాసుకునేవారు. దాంతో మెజారిటీ సీట్లు సంపాదించి కాంగ్రెస్ గ్రేటర్ పాలనా పగ్గాలు చేపట్టింది. ఆ తరువాత టీయారెస్ అధికారంలోకి రావడంతో సీన్ మొత్తం మారింది.

టీయారెస్ పదునైన వ్యూహాలు అమలు చేస్తూ గ్రేటర్ లో గెలిచేలా చూసుకుంటోంది. 2016లో జరిగిన ఎన్నికల్లో 99 సీట్లు టీయారెస్ సంపాదించి అంటే గులాబీ పార్టీ సత్తా ఏమిటో తెలిసిందే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడిపోయింది. టీడీపీ అయితే ఒక్క సీటుకే పరిమితం అయింది. మరిపుడు చూస్తే రెండవమారు వరసగా టీయారెస్ గెలిచేందుకు పావులు కదుపుతోంది.

గ్రేటర్ లో కాంగ్రెస్ కి బలమైన నాయకులు ఉన్నా వారంతా ఇపుడు టీయారెస్ కి వెళ్ళిపోయారు. మిగిలిన వారు బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో స్టార్ కాంపెనియర్ గా కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి మారిపోయారు. ఆయన ప్రస్తుతం టీయారెస్ కి ధీటుగా ప్రచారం చేస్తున్నారు. అటు బీజేపీని ఇటు అధికార పార్టీని ఏకకాలంలో చీల్చిచెండాడుతున్నారు.

ఇదిలా ఉంటే గ్రేటర్ లో ఒకనాడు ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు దీనంగా ఉండడమే రాజకీయ విషాదం, బడా నాయకులు  ఫుల్ సైలెంట్ అయ్యారు. ప్రజాకర్షణ కలిగిన వారు కూడా లేరు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రచారం ఊపు మీద సాగుతున్నా ఆయన సైతం కాంగ్రెస్ పార్టీకి ముప్పై సీట్లు వస్తే చాలు అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం షాకింగ్ పరిణామమే. నిజానికి బీజేపీ కంటే పెద్ద పార్టీ, గ్రేటర్ ని ఏలిన పార్టీ కాంగ్రెస్ కి ఎందుకు అంత తక్కువ నంబర్ సీట్లు రావాలి. ఏకంగా మేయర్ సీటునే టార్గెట్ చేయవచ్చుగా. మొత్తానికి రేవంతే ముప్పయి అన్నారంటే అసలైన  ఫలితాల్లో ఎన్ని స్థానాలు కాంగ్రెస్ కి వస్తాయో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: