గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు హోరాహోరీగా జరిగేలా కనిపిస్తున్నాయి. అన్నీ పార్టీలు గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్-బీజేపీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. అటు కాంగ్రెస్ సైతం దూకుడు కనబరుస్తోంది. ఇటు ఓల్డ్ సిటీలో ఎం‌ఐ‌ఎం దూసుకెళుతుంది. ఇక టీడీపీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే గ్రేటర్ బరిలో ఇన్ని పార్టీలు బరిలో ఉన్న ప్రధాన పోటీ టీఆర్ఎస్-బీజేపీకి అన్నట్లుగానే పరిస్తితి కనిపిస్తోంది.

ఇటీవల దుబ్బాక ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్‌ని మట్టికరిపించి బీజేపీ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. అసలు టీఆర్ఎస్‌కు పోటీ అనుకునే కాంగ్రెస్ పార్టీ చతికలపడింది. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయంలా కనిపిస్తోంది. అందుకే ఈ రెండు పార్టీల మధ్యే మాటల యుద్ధం ఎక్కువగా నడుస్తోంది. బీజేపీ..ప్రధానంగా టీఆర్ఎస్‌పై విమర్శలు ఎక్కుపెట్టింది. అలాగే ఎం‌ఐ‌ఎంని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతోంది.

అటు అధికార టీఆర్ఎస్ సైతం..బీజేపీనే అసలు ప్రత్యర్ధిగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే మొన్న దుబ్బాక ఉప ఎన్నికలో ఘోరంగా ఓడిపోవడంతో గులాబీ నేతలు, కమలా దళాన్ని టార్గెట్ చేసి  తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గ్రేటర్‌లో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి కేటీఆర్...కమలం నేతలనీ టార్గెట్ చేసి వాగ్భణాలు సంధిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో పాటు, స్థానిక బీజేపీ నేతల లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు.

అటు బీజేపీ బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్‌లు...కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు లక్ష్యంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ సైతం తాము రేసులో ఉన్నామనే చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై విరుచుకుపడుతుంది.
ఇక టీడీపీని అయితే ఎవరు ఒక్క మాట కూడా అనడం లేదు. అసలు ఆ పార్టీ పోటీలోనే లేదన్నట్లు భావిస్తున్నారు. టీడీపీ మాత్రం..అధికార టీఆర్ఎస్ వైఫల్యాలని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే గ్రేటర్ వార్‌లో టీఆర్ఎస్, బీజేపీల మధ్యే అసలు యుద్ధం నడిచేలా కనిపిస్తోంది.      

మరింత సమాచారం తెలుసుకోండి: