గ్రేటర్ ఎన్నికల హడావుడితో భాగ్యనగరం హీటెక్కుతోంది. అన్నిపార్టీలకు చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగారు. దీంతో ప్రచారం జోరందుకుంది. ఆయా పార్టీల అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలతో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారం కొందరు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరి వ్యాఖ్యలు వివాదాలకు దారి తీస్తున్నాయి.

 ఈ క్రమంలోనే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఎటువంటి అభివృద్ధీ చేయలేదని ఆరోపించారు. 4,700 ఎకరాలు ఉండాల్సిన హుస్సేన్‌సాగర్ ఇవాళ 700 ఎకరాలు కూడా లేదని విమర్శించారు. అక్రమ కట్టడాలను కూల్చేస్తామని టీఆర్ఎస్ అధికారులు ఆర్భాటం చేశారని, అలాంటప్పుడు హుస్సేన్‌ సాగర్ కట్టపై ఉన్న కట్టడాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

ఇక్కడ ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చి వేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా గత ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని టీఆర్ఎస్ చేసిన హామీని గుర్తు చేశారు. కానీ ఇంతవరకు ఆ డబుల్ ఇళ్ల సంగతి తేల్చలేదని, అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలీదని ఎద్దేవా చేశారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకు ఇవ్వలేదని తీవ్రమైన స్థాయిలో మండి పడ్డారు. మళ్లీ ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఎప్పట్లాగే మాయ మాటలు చెబుతోందని నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ తోక ఎలా కత్తిరించాలో తమకు తెలుసని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మహానేత ఎన్టీయార్ సమాధులు కూల్చాలనడం తీవ్రమైన విమర్శలకు దారి తీస్తోంది. అక్బరుద్దీన్ వ్యాఖ్యలను తప్పు బడుతూ చాలామంది నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్బరుద్దీన్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు చేస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత దూరం వెళ్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: