గ్రేటర్ ఎన్నికల హడావుడితో భాగ్యనగరం హీటెక్కుతోంది. అన్నిపార్టీలకు చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగారు. దీంతో ప్రచారం జోరందుకుంది. ఆయా పార్టీల అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలతో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారం కొందరు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరి వ్యాఖ్యలు వివాదాలకు దారి తీస్తున్నాయి.

 ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. హుస్సేన్ సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీయార్ సమాధులను కూల్చేయాలంటూ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా అక్బరుద్దీన్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలన్న అక్బర్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘హుస్సేన్ సాగర్‌పై ఉన్న పీవీ సమాధిని, ఎన్టీఆర్ సమాధిని కూల్చే దమ్ము నీకుందా? నీ అయ్య జాగీరా, నీ తాత జాగీరా భాయ్. పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చిన రెండుగంటల్లో నీ దారుస్సలాంను బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారు’ అని వార్నింగ్ ఇచ్చారు. దేశం కోసం ఎంతో చేసిన పీవీ సమాధిని కూలుస్తారా? ఎన్టీఆర్ సమాధిని కూలుస్తారా? అంటూ నిప్పులు చెరిగారు.

టీఆర్ఎస్ ఏం చేయాలన్నా ఎంఐఎం పార్టీ చేతుల్లోనే ఉందని, ఎంఐఎం చెప్పినట్లే టీఆర్ఎస్ ఆడుతోందని విమర్శించారు. మభ్యపెట్టి, ఏమార్చి ఓట్లు పొందాలని ఈ రెండు పార్టీల నేతలు ప్లాన్లు వేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు చేవచచ్చి ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎంఐఎం నాయకులు చేసే సవాల్‌ను స్వీకరించలేని దౌర్భాగ్య స్థితిలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు ఓ వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారని, వీరిని ఎదుర్కోవాలంటే హిందువులు అందరూ కలిసి ఓటు బ్యాంకుగా మారాలని, బీజేపీని హైదరాబాద్‌లో గెలిపించాలని పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: