జిహెచ్ఎంసి ఎన్నికల వేళ శాంతిభద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తీవ్ర నిరాశా నిస్పృహలో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో ఘర్షణలు,అల్లర్లు సృష్టించి ఓట్ల కోసం మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని, వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీసు అధికారులను ఆదేశించారు. అరాచక శక్తుల కుట్రలకు సంబంధించి ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉందని సిఎం అన్నారు.

హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడమే అత్యంత ప్రధానమని, సామరస్యంగా  ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా నా తెగించే రాజకీయ పార్టీలు ఉన్నాయని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే వ్యక్తులు, పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ కోరారు.పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇస్తుందని సిఎం ప్రకటించారు.రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డి.జి.పి. మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిపిలు అంజనీ కుమార్, విసి సజ్జనార్, మహేశ్ భగవత్, అడిషనల్ డిజిపి జితేందర్, ఐజిలు స్టీఫెన్ రవీంద్ర, వై. నాగిరెడ్డి, నిజామాబాద్ ఐజి శివ శంకర్ రెడ్డి, వరంగల్ ఐజి ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ప్రశాంత హైదరాబాద్ లో మత చిచ్చు పెట్టడానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నాలు చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉద్వేగాలు, ఉద్రేకాలు రెచ్చగొట్టే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవద్దని యువకులను కోరారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకంగా పోరాడాలని రాజకీయ పార్టీలను కోరారు సీఎం కేసీఆర్. రసవత్తరంగా మారుతున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం ఏ పార్టీని వరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: