గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేస్తామంటూ.. జనసేన అభ్యర్థుల్ని కూడా బరిలో నిలపకుండా తప్పించిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత బీజేపీ తరపున ప్రచారం చేస్తారని అనుకున్నారంతా. అయితే పవన్ అనుకోకుండా ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. తిరుపతి లోక్ సభకు జరిగే ఉప ఎన్నికలకోసమే పవన్ ఢిల్లీ వెళ్లారని అనుకున్నా, గ్రేటర్ లో బీజేపీ తరపున ప్రచారం చేసే బాధ్యత కూడా ఆయనపై అధిష్టానం పెడుతుందని భావించారు. ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ హైదరాబాద్ కి వచ్చి గ్రేటర్ ప్రచారం చేపడతారనే వార్తలు కూడా వచ్చాయి. సెటిలర్ల ఓట్లు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తే అది బీజేపీకి లాభిస్తుందని ఆశించారు. అందుకే పవన్ ని ఢిల్లీకి పిలిపించారని, గ్రేటర్ ప్రచార బాధ్యతలు అప్పగిస్తారనే ఊహాగానాలు వినిపించాయి.

అయితే పవన్ కల్యాణ్ ఢిల్లీ  పర్యటన తర్వాత గ్రేటర్ ప్రచారంపై ఓ క్లారిటీ వచ్చింది. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలసిన అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ ఎక్కడా గ్రేటర్ ఎన్నికల గురించి ప్రస్తావించలేదు. గ్రేటర్ బరిలో తాను ప్రచారం చేపడతానని కూడా ప్రకటించలేదు. దీంతో పవన్ హైదరాబాద్ లో బీజేపీ తరపున ప్రచారం చేపట్టే అంశంపై పూర్తిగా క్లారిటీ వచ్చేసింది.

ఇప్పటికే గ్రేటర్ లో బీజేపీ తరపున మహామహులు ప్రచారంకోసం వస్తున్నారు. కేంద్ర మంత్రులు ఆల్రడీ వచ్చేశారు, ఇతర రాష్ట్రాల ముఖ్యమత్రులు కూడా వస్తారని అంటున్నారు. దుబ్బాక ఫలితంతో గ్రేటర్ పై పూర్తి స్థాయిలో ఆశలు పెట్టుకుంది బీజేపీ. ఎంఐఎంని నిలువరించి బల్దియా పీఠం దక్కించుకునే ఆశ లేకపోయినా.. కనీసం ప్రతిపక్షంలో కూర్చుని అయినా టీఆర్ఎస్ ఆధిపత్యానికి గండి కొట్టాలని అనుకుంటున్నారు బీజేపీ నేతలు. అందుకే గ్రేటర్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో నమ్మకం పెట్టుకున్నారు. అదే ఊపులో జనసేనను పక్కకు తప్పించి మరీ బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: