గ్రేటర్ ఎన్నికల ముందు స్వామిగౌడ్ టీఆర్ఎస్ ని వీడటం ఆ పార్టీకి నష్టం చేకూరుస్తుందని అంటున్నారంతా? అయితే స్వామిగౌడ్ ఇటీవల కాలంలో క్రియాశీలక రాజకీయాల్లో లేరు. తెలంగాణ ఏర్పడిన తర్వాత శాసన మండలికి తొలి చైర్మన్ గా ఉన్న స్వామిగౌడ్ ఆ తర్వాత కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దీంతో గ్రేటర్ ఎన్నికలపై ఆయన పార్టీ మార్పు ప్రభావం ఎంతమేరకు ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.

అయితే జీహెచ్ఎంసీ పరిధిలో స్వామిగౌడ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువమంది ఉన్నారని, వారిలో ఎక్కువశాతం మందిని స్వామిగౌడ్ ప్రభావితం చేయగలరనేది మరో వాదన. దీంతో స్వామిగౌడ్ పార్టీ మార్పు బీజేపీ విజయావకాశాలను పెంచుతుందని, అదే సమయంలో కనీసం 10 డివిజన్లలో అయినా టీఆర్ఎస్ ని ఓటమి అంచుల వరకు తీసుకెళ్తుందని అంటున్నారు.

ఈసారి ఎలాగైనా బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని భావిస్తోన్న బీజేపీ, దానికి అనుగుణంగానే తమ వ్యూహాలకు కూడా పదునుపెడుతోంది. ప్రచారంపై దృష్టి పెడుతూ మరోవైపు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్‌ లోని అసంతృప్త నేతలకు గాలం వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలను పార్టీలోకి చేర్చుకొని టికెట్‌ ఇవ్వగా తాజాగా స్వామిగౌడ్‌ను తమ గూటికి చేర్చుకుంది. బీజేపీలో చేరడం అంటే తన తల్లి గారి ఇంటికి వచ్చినట్లు భావిస్తున్నట్టు చెప్పిన స్వామిగౌట్.. తెలంగాణ జెండా పట్టని వారికి కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమంలో పోరాటం చేసిిన వారిని ఎండలో నిలబెట్టారని, తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం దొరుకుతుందనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరానని చెప్పారు.

వందసార్లు కేసీఆర్‌ అపాయింట్‌ మెంట్ కోరినా ఇవ్వలేదని వాపోయారు స్వామిగౌడ్. స్వామిగౌడ్ మాత్రమే కాదు.. టీఆర్ఎస్ లో క్రమక్రమంగా ప్రాధాన్యం కోల్పోతున్న ఉద్యమ కారులు కూడా కేసీఆర్ పై గుర్రుగా ఉన్నారు. వీరంతా ఈ దఫా.. టీఆర్ఎస్ ఓటమికోసం పనిచేస్తారని కూడా అంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ నిరంకుశత్వం పెరిగిపోయిందని, కేవలం కుటుంబ సభ్యులకే ప్రయారిటీ ఇస్తూ ఉద్యమ కారులను పక్కనపెట్టారనే వాదన కూడా ఉంది. మరోవైపు స్వామిగౌడ్ లాంటి కీలక నేతల చేరిక టీఆర్ఎస్ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: