ఎన్నికలు వస్తే కానీ... ప్రజలు గుర్తుకు రారా, ఓటెయ్యండి అంటూ వచ్చి హామీ లు ఇచ్చి తర్వాత ఎన్నికల అనంతరం పనైపోయింది అంటూ చేతులు దులుపుకుంటారా .!! అసలు సామాన్య ప్రజల ఇబ్బందులను, కనీస అవసరాలను తీర్చడం మీ బాధ్యత కాదా అంటూ రాజకీయ నాయకులను ప్రశ్నిస్తున్నారు ప్రజలు. టిఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి జగదీష్ గౌడ్ కు చేదు అనుభవం ఎదురైంది... మా సమస్యను పట్టించుకోండి సార్ అంటూ ప్రజలు నిరసనకు దిగారు... దాంతో జగదీష్ గౌడ్ ఈ సమస్యకు కేంద్ర బిందువుగా మారారు.

త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలో నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారాల పనుల్లో బిజీ బిజీగా మునిగిపోయారు. అయితే ప్రచారాలకు వెళ్ళిన పలువురు నాయకుల్ని చాలా చోట్ల ప్రజలు  తమ ఇబ్బందుల గురించి చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. అందులోనూ ఎక్కువగా టీఆర్ఎస్ అభ్యర్థులకు ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఇటువంటి  సమస్య ఒకటి కార్పొరేటర్ అభ్యర్థి జగదీష్ గౌడ్ కి ఎదురయింది. మల్కాజిగిరిలో రోడ్ల పనులు గత తొమ్మిది నెలలుగా పెండింగ్లో ఉన్నాయంటూ ఎక్కడి పనులు అక్కడ ... అలా ఆ పనిని ఎందుకు మధ్యలో వదిలేశారు అంటూ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి జగదీష్ గౌడ్ ను ప్రశ్నించారు అక్కడి స్థానికులు.

దానివలన ప్రజలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నది పట్టించుకోరా అంటూ నిలదీశారు. ప్రజలకు ఎంత అసౌకర్యంగా ఉన్నా... ఇలా ఇంకా ఎంతకాలం ఆ రోడ్లో పనులను పెండింగ్లోనే ఉంచి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారంటూ నిరసనకు దిగారు మల్కాజ్ గిరి స్థానికులు. రోడ్లన్నీ గుంతలమయం కావడంతో స్థానిక కార్పొరేటర్ గా ఉన్నటువంటి జగదీష్ గౌడ్ ఈ సమస్యను ఇంత వరకు పట్టించుకోకుండా వదిలేశారు అని ప్రజలు అసహనాన్ని వ్యక్తపరుస్తూ నిరసనకు దిగారు. అందులోనూ వర్షాకాల సమయం కావడంతో ఆ రోడ్డు మరింత దుర్భరంగా మారింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ సమస్యకు కార్పొరేటర్ అభ్యర్థి జగదీష్ గౌడ్ ఎలాంటి పరిష్కారం చూపుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: