రాజకీయాలు అన్నవి రఫ్ గా ఉంటాయి. కానీ ఆ గేమ్ స్మూత్ గానే ఆడాలి. ఎందుకంటే ఇది కోట్లాది జనాలతో ముడిపడిన రంగం. రాజకీయాల్లో విజయం, అపజయం రెండూ భారమే. వాటిని నెత్తికెక్కించుకుంటే ఫలితమూ భారమే. ఇదిలా ఉంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన జోరులో బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రెడీ అయింది. ఒక విధంగా దుబ్బాక గెలుపు అన్నది బీజేపీకి మంచి బూస్టప్ ఇచ్చిన మాట వాస్తవం. ఇందులో రెండవ మాటకు తావు లేదు.

అయితే ఒక నియోజకవర్గం రెండు లక్షల ఓటర్ల కధను తెచ్చి గ్రేటర్ లో కూడా దాన్నే అప్లై  చేయాలనుకోవడమే బీజేపీ చేస్తున్న పొరపాటు, బీజేపీ ఇక తన ఉత్సాహంతో హద్దులు మీరుతోందన్న విమర్శలు వస్తున్నాయి. మాటలు జారుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రేటర్ లో అన్ని రకాలవర్గాల  ప్రజలూ ఉన్నారు. అన్ని రాష్ట్రాల ప్రజలూ ఉన్నారు.

వారి మనో భావాలను గమనించి ఇక్కడ రాజకీయం చేయాలి. దాదాపు కోటి మంది జనాభా, 80 లక్షల ఓటర్లు కలిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ దూకుడు పంధానే ఎంచుకోవడం విశేషం. గ్రేటర్ లో నగర జనాభా ఉంటుంది. మేధావులు ఉంటారు.  చదువరులు ఉన్నారు,  అటువంటి చోట కచ్చితమైన రాజకీయ సందేశం ఇవ్వాల్సిన కమలం ఎందుకో తడబడుతోంది.

అంతే కాదు ఆ పార్టీ  నేతలు చేస్తున్న ప్రచారం, మాటలు అన్నీ కూడా చివరికి బెడిసికొట్టేలా ఉన్నాయని సొంత పార్టీలోనే కామెంట్స్ పడుతున్నాయి. సాక్ష్తాత్తూ రాష్ట్ర అధ్యక్షుడు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని అనడం సమంజసం కాదన్న భావన కూడా ఉంది. అలాగే దుబ్బాక నుంచి గెలిచిన ఎమ్మెల్యే రఘునందనరావు వైఎస్సార్ మీద చేసిన విమర్శలు కూడా విజయావకాశాల మీద ప్రభావం చూపించేలా ఉన్నాయి. మరి చూడాలి. ఇప్పటికైనా బీజేపీ జాగ్రత్త పడుతుందో లేదో. లేకపోతే కచ్చితంగా బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అవుతుంది అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: