జాతీయ స్థాయిలో ఇటీవల పలు పురస్కారాలు, ప్రశంసలు అందుకున్న ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ తాజాగా మరో అరుదైన రికార్డు అందుకుంది. మహిళల రక్షణే ధ్యేయంగా ఏపీ పోలీస్‌ శాఖ తెచ్చిన దిశ మొబైల్‌ అప్లికేషన్‌ 11 లక్షల డౌన్‌ లోడ్స్‌ ను అధిగమించి రికార్డు సృష్టించింది. తెలంగాణలో జరిగిన దిశ ఉదంతంతో మహిళల రక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్లో భాగంగా ఆపదలో ఉన్న మహిళలకు వెంటనే పోలీసుల సాయం అందేలా ప్రత్యేకంగా దిశ మొబైల్‌ అప్లికేషన్‌ తీసుకొచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి-8న సీఎం జగన్ ఈ యాప్ ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ యాప్ అద్భుతమైన ఫలితాలు సాధిస్తోందని అంటున్నారు పోలీసులు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలిస్తోందని చెబుతున్నారు.

క్లుప్తంగా దిశ యాప్ గురించి..
ఇప్పటి వరకూ 11 లక్షలకు పైగా యూజర్లు ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకున్నారు.
దిశ యాప్‌ ద్వారా సహాయం కోరిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాష్ట్రంలో 604 మంది మహిళలకు అండగా నిలిచారు.
దిశ యాప్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను దర్యాప్తు చేసిన పోలీసులు 122 కేసులు నమోదు చేశారు.
బాధిత మహిళలు ఎక్కడినుంచైనా నా ఫిర్యాదు చేయొచ్చనే వెసులుబాటుతో పోలీసులు 341 జీరో ఎఫ్‌ఐఆర్ లు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దిశ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరిగిన అమానుష ఘటనల్లో నిందితులకు సత్వరమే శిక్షలు పడేలా చేయడంపై పోలీసులు పట్టుసాధిస్తున్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి సంఘటనల్లో 79 కేసుల్లో తీర్పులు వచ్చాయి.

ప్రతి మహిళా తన మొబైల్‌ లో ఈ యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకుని ఇన్ ‌స్టాల్‌ చేసుకోవాలని పోలీసులు తెలియజేశారు. తమకే కాకుండా తమ పరిసరాల్లో ఏ మహిళకు అన్యాయం జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించేలా ఈ అవకాశాన్ని ఉపయోగించు కోవాలని సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: