జీహెచ్ఎంసీ ఎన్నికలంటే.. టీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్ కూడా ఉత్సాహంగా ఉండేది. అయితే తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ని అందరూ లైట్ తీసుకున్నారు. చివరకు కాంగ్రెస్ అభ్యర్థులకు కూడా గెలుపుపై ధీమా లేకుండా పోయిందని అంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీ పోరాటం మధ్యలో కాంగ్రెస్ నాయకులు ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా ఎవ్వరిపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయిందనే విషయం అర్థమవుతోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆచరణకు అందని హామీలన్నీ గుప్పించడంతో ఆ పార్టీ మేనిఫెస్టో సహా అభ్యర్థులను కూడా ఓటర్లు లైట్ తీసుకున్నారని అంటున్నారు.
మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలేంటి?
వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం
ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు సాయం
వరదల్లో మునిగిన కుటుంబాలకు తక్షణసాయం కింద రూ. 50 వేలు చెల్లింపు
ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలకు, దివ్యాంగులకు ఉచిత రవాణా సౌకర్యం
ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు విస్తరణ

కాంగ్రెస్ మేనిఫెస్టోని ఒకసారి పరిశీలిస్తే.. ఏ దశలోనూ ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించినట్టు తెలుస్తోంది. గెలుపు సాధ్యం కాదు కాబట్టే.. కాంగ్రెస్ నేతలు భారీగా హామీలు గుప్పించారని అంటున్నాయి విపక్షాలు. దాదాపుగా టీఆర్ఎస్, బీజేపీ నేతలు.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారే కానీ.. కాంగ్రెస్ ని పరిగణలోకి తీసుకోలేదు, వారిపై విమర్శలూ ఎక్కుపెట్టలేదు. దీంతో అటు పార్టీలు పట్టించుకోక, ఇటు ప్రజలు పట్టించుకోక.. కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంలా మారింది. గత ఎన్నికల్లో వచ్చిన ఒకటీ అరా సీట్లు కూడా ఈ దఫా కాంగ్రెస్ కి దక్కే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

అటు కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కూడా గ్రేటర్ పై పెద్దగా దృష్టిపెట్టినట్టు లేదు. ఓవైపు బీజేపీ కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు జీహెచ్ఎంసీ ప్రచారానికి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి గట్టి నాయకులెవరూ హైదరాబాద్ కి రావట్లేదు. భారమంతా రాష్ట్ర నాయకత్వంపైనే వదిలేశారు. దీంతో కాంగ్రెస్ విజయంపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేకుండా పోయాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: