ముషీరాబాద్ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం వేడివేడిగా కొనసాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రచార వేగం పెంచారు. తమకే ఓట్లు వేయాల్సిందిగా ప్రజలను కోరుతున్నారు. బుధవారం ముషీరాబాద్‌లోని వైఎస్సార్ పార్కు, వీధి, ఫ్రెండ్స్ కాలనీ, కళాధర్ నగర్, ఎంసీహెచ్ కాలనీ తదితర ప్రాంతాల్లో ముషీరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ఎడ్ల భాగ్యలక్ష్మిహరిబాబుయాదవ్ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తూ కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. మరోసారి కార్పొరేటర్‌గా గెలిపిస్తే, మరింత అభివృద్ధి పరుస్తానన్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేసేది ఒక్క టీఆర్ఎస్ పార్టీనే అని, అలాంటి పార్టీని మరోసారి గెలిపించాలని కోరారు. క్రీడాకారులకోసం రూ.3 కోట్లకు పైగా ఖర్చు చేసి మినీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించామన్నారు. ఈ కాంప్లెక్స్ త్వరలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. డివిజన్‌లోని అన్ని ప్రాంతాల్లో అనేక సమస్యలు పరిష్కరించామన్నారు. మరోసారి కార్పొరేటర్‌గా గెలిపించాలని టీఆర్ఎస్ అభ్యర్థి ఎడ్ల భాగ్యలక్ష్మి హరిబాబుయాదవ్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సయ్యద్ అహ్మద్ భక్తియార్, వరుణ్, అరుణ్, గోవింద్, అభినందన్ యాదవ్, శ్రీనివాస్, వెంకటేష్, ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

డివిజన్‌లో  నెలకొన్న సమస్యల పరిష్కారానికి కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని ముషీరాబాద్ డివిజన్ బీజేపీ అభ్యర్థి ఎం.సుప్రియా నవీన్ గౌడ్ ప్రజలను కోరారు. బుధవారం ముషీరాబాద్ డివిజన్‌లోని మొరంబొంద, అంబేద్కర్ కాలనీ, బాపూజీనగర్, గంగపుత్రకాలనీ, తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొరంబొంద గుడిసె వాసులకు పక్కా గృహాలు నిర్మించేందుకు కృషి చేస్తానని అన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా డివిజన్‌లో మంచినీరు, డ్రైనేజీ పైప్ లైన్లను ఆధునికికరిస్తామన్నారు. వర్షాకాలం వచ్చిందంటే రోడ్లన్నీ బురుదమయమవుతున్నాయని, అధ్వాన స్థితికి చేరుకున్న రోడ్లను మోడల్ రోడ్లుగా తీర్చిదిద్దేందుకు ఒక్కసారి అవకాశం కల్పించాలన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు. బీజేపీ గెలుపే టీఆర్ఎస్‌కు గుణపాఠమన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ బీజేపీ జాయింట్ కన్వీనర్ ఎం.నవీన్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు బద్రి నారాయణ, బీజేపీ నాయకులు కుశాల్ గౌడ్, కంచి, సత్య నారాయణ, అనిల్, సురేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: