గ్రేటర్ ఎన్నికల ప్రచారం మంచి జోరు మీద సాగుతోంది. దూకుడు మీద నేతలు ఉన్నారు. ఇక ఒకరిని ఒకరు విమర్శించుకోవడంలో కూడా పోటీ పడుతున్నారు. ప్రత్యర్ధిని  కార్నర్ చేయడానికి కూడా చూస్తున్నారు. ఇలా మాటల గారడీతో తమదే పై చేయి అనిపించుకోవాలన్న ఆరాటం నాయకులది. జనాలను తమ వైపు తిప్పుకోవాలన్న తాపత్రయం కూడా అందులోనే ఉంది.

ఇక ఇప్పటివరకూ జరిగిన ప్రచారం ఒక ఎత్తు. అధికార పక్షం తరఫున మంత్రి కేటీయార్ అలుపెరగని విధంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ఒక్కడే మొత్తానికి మొత్తం భాగ్యనగరాన్ని చుట్టేస్తున్నారు. ఇక బీజేపీ అయితే ఢిల్లీ నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి జాతీయ నేతలను రంగంలోకి దింపేసి మరీ రాజకీయ రచ్చ చేస్తోంది. ఒక విధంగా చావో రేవో అన్నట్లుగా కమలం కసిగా బరిలోకి దూకుతోంది.

ఇపుడు కాకపోతే మరెప్పుడూ గ్రేటర్ పీఠం తమకు దక్కదు అన్నట్లుగానే ఆవేశపడుతోంది. ఇలా రెండు వైపులా అంతా మోహరించి ఉన్నారు. మాటకు మాట. సవాల్ కి ప్రతి సవాల్.. ఇప్పటిదాకా ఇదే సీన్. మరి దీన్ని టర్న్ చేయాలంటే ఎలా. ఆ లాస్ట్ పంచ్ కోసమే కేసీయార్ రంగంలోకి దిగబోతున్నారు. ఆయన ఒకే ఒక సభను నిర్వహిస్తారు. అది చాలు. టోటల్ గా ఎన్నికలను ప్రభావితం చేయడానికి అంటున్నారు.

ఇప్పటిదాకా జరిగిన రాజకీయ ఆరాటాలకు, పోరాటాలకు కేసీయార్ తనదైన మార్క్ తో జవాబు ఇస్తారని అంటున్నారు. అన్ని పార్టీలకు ఒకే ఒక్క సమాధానం అన్నట్లుగా అదిరిపోయే లెవెల్లో కేసీయర్ సభ ఉంటుందని టాక్. అది చాలు గులాబీ దండులో వీరావేశం రగల్చడానికి అంటున్నారు. ఆ ఒక్క మీటింగ్ చాలు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అని కూడా చెబుతున్నారు. మొత్తం గ్రేటర్ సినేరియాను మార్చేందుకు లేట్ గా అయినా లేటెస్ట్ గానే గులాబీ బాస్ రంగంలోకి దిగుతున్నారని అంటున్నారు మరి చూడాలి కేసీయార్ మాటల మంత్రజాలం, మహేంద్రజాలం ఎలా గ్రేటర్ కోటను ముట్టడిస్తాయో.


మరింత సమాచారం తెలుసుకోండి: