గ్రేటర్ ఎన్నికల హడావుడితో భాగ్యనగరం హీటెక్కుతోంది. అన్నిపార్టీలకు చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగారు. దీంతో ప్రచారం జోరందుకుంది. ఆయా పార్టీల అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలతో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఇటువంటి సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేత, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ షాకిచ్చారు. గులాబీ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అంతే కాక టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్న బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించారు.

దీంతో టీఆర్ఎస్‌లో ఏం జరుగుతుంది? అనే అనుమానాలు అందరిలోనూ మొలకలు ఎత్తాయి. ఈ క్రమంలో తాను టీఆర్ఎస్ ఎందుకు వీడిందీ స్వామి గౌడ్ వెల్లడించారు. పార్టీలో తనకు ఎదురైన సమస్యలను వివరించారు. తాను కారణం లేకుండా పార్టీని వీడలేదని, అలా తాను ఎప్పటికీ చేయబోనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ హయాంలో శాసన సభ చైర్మన్‌గా స్వామి గౌడ్ పని చేశారు. ఇలాంటి కీలక పదవి కట్టబెట్టిన కేసీఆర్‌కు ఇలా గుడ్ బై చెప్పడం ద్రోహమేనని కొందరు చేస్తున్న విమర్శలపై కూడా స్వామి గౌడ్ స్పందించారు.

సీఎం కేసీఆర్ తనకు శాసన మండలి చైర్మన్ పదవి ఉట్టి పుణ్యానికేమీ ఇవ్వలేదని స్వామి గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రాష్ట్రం కోసం చాలా కష్టపడ్డామని, అందుకే తనకు ఆ పదవి  వచ్చిందని తెలిపారు. పార్టీకి కావాల్సినంత మెజార్టీ ఉన్నప్పుడు వేరే పార్టీ వ్యక్తులతో పనేంటని? కానీ కేసీఆర్‌కు ఇవేమీ పట్టవని ఇతర పార్టీల నేతలను చేర్చుకుని, వారికి పెద్ద పీట వేయడం మొదలు పెట్టారని విమర్శించారు. అసలు వేరే పార్టీ వాళ్లను టీఆర్ఎస్‌లోకి తీసుకోవడమే కేసీఆర్ చేసిన తప్పు అన్నారు. ఇతర పార్టీలవారికి ఇచ్చిన గౌరవం కూడా కేసీఆర్ తనకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్ వంటి వారు చేసే వివాదాస్పద వ్యాఖ్యలకు ధైర్యం ఎవరు ఇస్తున్నారో ప్రజలు ఆలోచించాలని చెప్పారు. మోదీ గుండె ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటున్నారని, అందుకే తాను కాషాయ పార్టీలో చేరానని స్వామిగౌడ్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: