మరికొద్ది రోజుల్లో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈసారి జరుగబోయే గ్రేటర్ ఎన్నికలు ప్రధానంగా అధికార టీఆర్ఎస్ మరియు బీజేపీల మధ్య వార్ లా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ తమ వ్యూహ రచనలో భాగంగా గత కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. గత కొంత కాలంగా హైదరాబాద్ నగరంలో తిరుగుతూ... ఇక్కడి ప్రజలను కలుస్తూ ఉన్నానని ఆయన వెల్లడించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల గురించి ప్రజల్ని అడిగి తెలుసుకున్నానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల పట్ల ఇక్కడి ప్రజలు పూర్తి అవగాహనతోనే ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు నిరాశ చెందారని అన్నారు.

‘‘ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందో అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. అందుకే పాలనలో మార్పు కావాలని ప్రజలు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మేయర్ పీఠాన్ని కూడా బీజేపీనే కైవసం చేసుకుంటుంది. ఇక్కడ పూర్తిగా అలాంటి వాతావరణమే కనిపిస్తోంది.’’ అని ప్రహ్లాద్ మోదీ అన్నారు.

అలాగే ఈ గ్రేటర్ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ బీజేపీపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ప్రహ్లాద్‌ మోదీ అన్నారు. కేంద్రం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ.. తెలంగాణకు అవేమీ అందడం లేదని సీఎం కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నగరంలో వరద బాధితులను ఆదుకోవడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రహ్లాద్ మోదీ ప్రస్తుతం ప్రధానమంత్రి జనకల్యాణ్‌ యోజన అభియాన్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పటికే తీవ్రస్థాయిలో వేడి పెరుగుతున్న ఈ ఎన్నికలు రాబోయే రోజుల్లో మరింత వేడిని పుట్టించడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: