ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 29న హైదరాబాద్ రానున్నారు. ఆయన పర్యటన ఆకస్మికంగా ఖరారైనట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల (GHMC) ప్రచారంతో టీఆర్‌ఎస్, బీజేపీ విమర్శలు, ప్రతివిమర్శలతో ఇప్పటికే నగరంలో వాతావరణం వేడెక్కగా.. ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ప్రధాని మోదీ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయోగాలను పరిశీలించడానికి వస్తున్నట్లు పీఎంవో అధికారులు తెలిపారు. దేశ పౌరులకు కరోనా టీకా అందించడానికి విశేషంగా కృషి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థకు చేరుకొని Covaxin ట్రయల్స్‌ను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.


వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశకు చేరుకున్న వేళ పంపిణీకి సంబంధించిన సన్నాహకాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ నేరుగా టీకా ప్రయోగాల పురోగతిని పరిశీలించనున్నారు. పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్‌ (CII) సంస్థలోనూ వ్యాక్సిన్ ఉత్పత్తి సన్నాహకాలను మోదీ పరిశీలించనున్నారు. ఇందుకు సంబంధించిన పర్యటన కూడా ఖరారైంది. ప్రధాని మోదీ ఈ నెల 29న ఉదయం ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడ నుంచి నేరుగా భారత్ బయోటెక్ (Bharath Biotech) సంస్థకు చేరుకుంటారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.


ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజలకు అభివృద్ధి ,ఆత్మగౌరవం రెండు ముఖ్యమన్నారు. ఈరెండింటి ఆధారంగా చేసుకొని మేనిఫెస్టో చేశామన్నారు. మెట్రో రైలు ,సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. కరోనా వ్యాక్సిన్ అందరికీ అందిస్తామన్నారు. కరోనా టెస్టింగ్ సెంటర్లను పెంచుతామన్నారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేసి ..15 వేల కోట్ల భారం హైదరాబాద్ ప్రజలపై పడకుండా విముక్తి కల్పిస్తామన్నారు. వరదల్లో నష్టపోయిన వారికి 25 వేల రూపాయలు అకౌంట్లలో వేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి అవాస్ యోజన కింద అందరికి గృహ నిర్మాణాలు చేపడతామన్నారు. ఆన్ లైన్ క్లాసుల కోసం విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామన్నారు. ప్రైవేటు స్కూల్ ఫీజుల నియంత్రణ చేపడతామన్నారు. ఉచిత నల్లా కనెక్షన్ ఉచిత నీరు అందించి మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నారు. 10 వేల కోట్లతో సుమేధ కొత్త చట్టం తీసుకువస్తామన్నారు. సుమేధ ద్వారా నాలల నిర్మాణం అక్రమ కట్టడాలు కూల్చివేత చేపడతామని హామీ ఇచ్చారు. 100 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్.. అందిస్తామన్నారు. గ్రేటర్‌లో తాము గెలిస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని వివిధ వరాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారా? లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: