బీజేపీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. చాలా మంది నేతలు బీజేపీ తలుపులు తడుతున్నారు. ఇదంతా గ్రేటర్  ఎన్నికల సమయంలోనే జరుగుతుండటం విశేషం. ఇలా పలువురు నేతలు బీజేపీలో చేరుతుండడం కమలం పార్టీలో ఫుల్ జోష్ నింపుతోంది. కొత్త వారిని పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో అసంతృప్తితో ఉన్న నాయకులను బీజేపీలో చేర్చుకునేందుకు సిద్ధమైంది. దీని కోసం ఆ పార్టీలోని సీనియర్ నాయకులు పావులు కదుపుతున్నారు. గ్రేటర్‌లో మంచి పట్టున్న నేతలు బీజేపీలో చేరితే పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని  ఈ నేతల అభిప్రాయం.

ఇందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విక్రమ్‌ గౌడ్‌ను బీజేపీ నేతలు కలిశారు. గురువారం మధ్యాహ్నం విక్రమ్‌ గౌడ్‌ను కలిసిన బీజేపీ సీనియర్ నేత, మాజీమంత్రి డీకే అరుణ.. బీజేపీలోకి రావాలని విక్రమ్‌ గౌడ్‌ను ఆహ్వానించారు. దీనిపై విక్రమ్ గౌడ్ కూడా సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. బీజేపీలో చేరడానికి రెడీగా ఉన్న విక్రమ్ గౌడ్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. విక్రమ్ గౌడ్ వంటి సీనియర్ నేత పార్టీని వీడితే చాలా నష్టమని సీనియర్లు భావిస్తున్నారు. ఆయన పార్టీ మారితే  బీజేపీ గ్రేటర్‌లో మరింత బలం పుంజుకునే అవకాశం ఉందనేది వాస్తవం. ఈ క్రమంలోనే విక్రమ్ గౌడ్ అభిప్రాయం మార్చుకునేలా చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం జాంబాగ్‌లోని విక్రమ్‌గౌడ్‌ కార్యాలయానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతురావు వెళ్లారు. అక్కడే విక్రమ్ గౌడ్‌తో కాసేపు మాట్లాడారు.

ఈ సందర్భంగా పార్టీలో తనకు సరైన గౌరవం దొరకడం లేదని విక్రమ్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. తన తండ్రి ముఖేష్ ‌గౌడ్ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు  పార్టీ నేతలు కనీసం పట్టించుకో లేదని విక్రమ్ ‌గౌడ్‌ కోప్పడ్డారట. హనుమంత రావు వెళ్లిపోయిన తర్వాత విక్రమ్ ‌గౌడ్‌కు రాజనర్సింహ, సీతక్క కూడా  ఫోన్‌ చేసి బుజ్జగించే ప్రయత్నం చేశారని సమాచారం. గౌరవం లేని చోట ఉండలేనని  విక్రమ్‌ గౌడ్ వాళ్లకు స్పష్టంగా చెప్పేశారట. రేపు సాయంత్రం నడ్డా సమక్షంలో బీజేపీలో చేరతానని విక్రమ్ గౌడ్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: