వరద బాధితులకు ఆదుకోవడానికి గ్రేటర్‌ ఎన్నికల అనంతరం వరద సాయాన్ని కంటిన్యూ చేయిస్తానని హోం మంత్రి మహమూద్‌ అలీ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి ఘాన్సీబజార్‌ డివిజన్‌ లోని చేలాపురాలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఘాన్సీబజార్‌ అభ్యర్థి అనూష గౌడ్‌ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడి నుంచి తమ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే.. డివిజన్‌ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించడానికి వీలు ఉంటుందని, అన్ని రకాల అభివృద్ధి పనులు చేయడానికి వీలు పడుతుందన్నారు.

అభివృద్ధిలో డివిజన్‌ పూర్తిగా వెనుకబడిందన్నారు. ఈ ఎన్నికల్లో గ్రేటర్‌లో అత్యధిక సీట్లు సాధించి మేయర్‌ పీఠాన్ని తిరిగి దక్కించుకుంటామన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ పార్టీ పని చేస్తోందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం గ్రేటర్‌ ఎన్నికల మ్యానిపెస్టోని సీఎం కేసీఆర్ రూపొందించడం జరిగిందన్నారు. అందరి సంక్షేమం కోరే  సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుకు గ్రేటర్‌ ఓటర్లు ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్, డివిజన్‌ ఎన్నికల పరిశీలకుడు మోహన్‌ గాంధీ నాయక్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ చార్మినార్‌ నియోజకవర్గం ఇంచార్జి మహ్మద్‌ సలావుద్దీన్‌ లోధి, నాయకులు దీపాంకర్‌పాల్, గోపీ గౌడ్‌ తదితరులున్నారు.

ఘాన్సీబజార్‌లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే స్థానిక ఓటర్లు అనుకూలంగా ఉన్నారని తెలంగాణ రాష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్, డివిజన్‌ ఎన్నికల పరిశీలకులు మోహన్‌గాంధీ నాయక్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘాన్సీబజార్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అనూష గౌడ్‌ తో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో  అనూష గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తమ పార్టీ అభ్యర్థి అనూష గౌడ్‌ డివిజన్‌లో వేగంగా  ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు.

మొఘల్‌పురా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సరితా యాదవ్‌ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొఘల్‌పురా డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పుప్పాల రాధాకృష్ణ మద్దతుగా పాల్గొని ఇంటింటికీ వెళ్లి సరితా యాదవ్‌కే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. గ్రేటర్‌ ఎన్నికల  మ్యానిపెస్టోని డివిజన్‌ ప్రజలందరూ స్వాగతిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు గోపినాథ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: