గ్రేటర్ ఎన్నికల్లో వాదోపవాదాలు జరిగినంతకాలం బీజేపీ నేతలు ఎప్పుడూ వార్తల్లోనే నిలిచారు. ముఖ్యంగా బండి సంజయ్.. చేసిన వ్యాఖ్యలు విపరీతంగా జనంలోకి వెళ్లాయి. తప్పా, ఒప్పా అనే విషయం పక్కనపెడితే.. గ్రేటర్ ఎన్నికలతో బండి సంజయ్ కి ఉన్న క్రేజ్ మాత్రం అమాంతంగా పెరిగింది. అయితే తాజాగా బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో మాత్రం ఆ పార్టీకి ఏమాత్రం అనుకూలంగా ఉండే అవకాశం లేదని తేలింది.

రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో కూడా మరీ అతిగా అనిపించింది. వరదల నష్టపరిహారం విషయంలో కాంగ్రెస్ చూపించిన ఉదారత.. అధికారం కోసం ఆ పార్టీ ఎలాంటి హామీలను ఇస్తుందో అర్థమవుతోంది. అయితే కాంగ్రెస్ కి పోటీగా బీజేపీ మేనిఫెస్టో ఉందని అంటున్నారు విశ్లేషకులు. బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో మరీ అంత గొప్పగా లేదు, అదే సమయంలో వాస్తవానికి దగ్గరగా కూడా లేదు. గ్రేటర్ ఎన్నికలకోసం మున్సిపల్ లెవెల్ కు దాటి హామీలు ఇచ్చింది.

మహిళలకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఉచిత ప్రయాణం అన్నది ఆకర్షణీయమే అయినా అమలు సాధ్యం ఆ పార్టీ ఆలోచించలేదనే విషయం స్పష్టమయింది. అసలు మహిళల నుంచి ప్రతి రవాణా వ్యవస్థకు ఎంత ఆదాయం వస్తుంది? అది ఎవరు భర్తీ చేస్తారు అనే విషయం ఆలోచించకుండానే బీజేపీ హామీ ఇచ్చింది. అసలు అంత పెద్ద బడ్జెట్ ని జీహెచ్ఎంసీ ఎలా భరిస్తుందనే విషయం కూడా తేల్చలేదు. ఒకవేళ మహిళలకు ఉచితం చేస్తే.. మిగతా వర్గాలపై చార్జీలు పెంచితే అది ఎవరికి ఉపయోగం.

100 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ కూడా ఊహించనిది, అదే సమయంలో ఆచరణ సాధ్యం కానిది అనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థలకు జీహెచ్ఎంసీ తిరిగి ఎంత చెల్లించాల్సి వుంటుందనే విషయం అసలు బీజేపీ ఆలోచించిందా లేదా అనే విషయం తేలాల్సి ఉంది. వీటన్నిటికీ జీహెచ్ఎంసీ వద్ద ఎంత బడ్జెట్ ఉంటుంది, దాన్ని హామీల అమలుకి ఎలా సర్దుబాటు చేస్తారనే విషయం అర్థం కావడంలేదు. ఒకరకంగా బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో సామాన్యులను ఆకట్టుకునేలా కనిపించడంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: