ఎన్నో యుద్ధాల్లో ఆరితేరిన యోధుడు నరేంద్ర మోడీ. ఆయన గత ఇరవయ్యేళ్ళుగా ఎక్కడా కదల‌కుండా కుర్చీలోనే కూర్చున్నారు. గుజరాత్ లో పుష్కరానికి పైగా ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటే గత ఆరున్నరేళ్ళుగా ప్రధాని కుర్చీలో కూర్చుని  దేశాన్ని ఏలుతున్నారు. మోడీ అంటేనే  మాటల మాంత్రికుడు, వ్యూహాల తాంత్రికుడు అని పేరుంది.

అటువంటి మోడీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ పనిగట్టుకుని మరీ వచ్చి వాలుతున్నారు అంటే దాని వెనకలా కచ్చితంగా రాజకీయ వ్యూహం ఉండే ఉంటుందని అంతా అనుమానిస్తున్నారు. మోడీ హైదరాబాద్ లోని భారత్ బయోటిక్ సంస్థ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ ని పరిశీలించేందుకు వస్తున్నారని అంటున్నారు.

నిజానికి ఇది అధికారిక పర్యటనగానే ఉంది. కానీ దీని వెనక రాజకీయాలను కూడా ఎవరూ కొట్టిపారేయడంలేదు. కరోనా ఇపుడు అందరినీ భయపెడుతున్న అంశం. ఇక బీజేపీ ఏలుబడిలో వ్యాక్సిన్ తయారు చేయించడం అంటే ఆ క్రెడిట్ కచ్చితంగా మోడీకే వెళ్తుంది. దాంతో పాటు హైదరాబాద్ వాసులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని బీజేపీ ఎన్నికల వేళ గట్టి హామీ ఇచ్చింది.

ఇలా మోడీ రాకకు, కరోనా వ్యాక్సిన్ కి మధ్య ఒక సంబంధం ఉంది. ఇది సానుకూలంగా జనాల్లోకి వెళ్ళాలన్నదే బీజేపీ ఆలోచన. ఎత్తుగడ కూడా. మరో వైపు చూసుకుంటే మోడీ ఎన్నికల వేళ తన రాకతో జనాల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించే అవకాశం ఉంది. ఆయన ఎన్నికల గురించి మాట్లాడరు, ఆయన ఇటు వైపు కూడా తొంగి చూడరు, కానీ ఆయన హైదరాబాద్ లో గడిపే ఆ కొద్ది గంటలు చాలు గ్రేటర్ ఎన్నికలలో బీజేపీ వైపుగా ఓటర్లను ప్రభావితం చేయడానికి. ఇక మోడీ మీద ఉన్న మోజు, క్రేజ్ కూడా కచ్చితంగా తమకు ఉపయోగపడతాయని బీజేపీ ఎటూ భావిస్తోంది. మొత్తం మీద మోడీ తాను మాట్లాడకుండానే తన ప్రెజెన్స్ ద్వారానే గ్రేటర్ ఓటరుకు మోళీ కడతారా అనంది చూడాలి. ఏది ఏమైనా కరెక్ట్ టైంలోనే మోడీ హైదరాబాద్ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: